ప్రధాని మోదీ ప్రసంగమే ప్రధాన ఆకర్షణగా ఎన్నికల ప్రచార వీడియోను రిపబ్లికన్ పార్టీ విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనుండడంతో ‘మరో నాలుగేళ్లు’ పేరుతో 107 సెకన్ల నిడివిగల తొలి ప్రచార వీడియోను ఆవిష్కరించింది. ఇండియన్-అమెరికన్ ఓటర్లను ఆకర్షించాలన్న లక్ష్యంతో దీన్ని రూపొందించింది. గతంలో హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ బహిరంగ సభలో మోదీ చేసిన ప్రసంగంలోని పలు అంశాలను ఇందులో పొందుపరిచింది.
అమెరికన్-ఇండియన్లు అమెరికా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, వారంతా అద్భుతమైన వ్యక్తులంటూ ప్రశంసించిన మాటలను కూడా ఇందులో పొందుపరిచారు. దీనిని ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ సహ ఛైర్మన్ అల్ మాసన్ ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా ఇండియన్ అమెరికన్లు డెమొక్రాటిక్ పార్టీకి ఓటు వేస్తుంటారని, కానీ ఈసారి రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. మోదీ, ట్రంప్‌ల మధ్య ఉన్న స్నేహమే ఇందుకు కారణమని చెప్పారు.