బాలు కోసం సామూహిక ప్రార్థనలు

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.   కాగా.. ఎస్పీబీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమకు చెందిన అందరితోపాటు సంగీతప్రియులూ ఆగస్టు 20న సామూహిక ప్రార్థనలు చేయాలని తమిళ సినీ పెద్దలు కోరుతున్నారు. ప్రముఖ నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌; దర్శకుడు భారతీరాజా; సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్‌; రచయిత వైరముత్తు కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘సినీరంగానికి చెందిన వారికి, సంగీత ప్రియులకు మాదో విన్నపం. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని మనమంతా ఆగస్టు 20న సాయంత్రం 6 గంటలకు సామూహిక ప్రార్థనలు చేద్దాం. ఎవరికి వారు తమ ఇంట్లోనే ఉండి.. ఎస్పీ బాలు పాడిన పాటలను ప్లే చేయాలి. ఆయన గాత్రం మనం మళ్లీ వినేలా చేసుకోవాలి’’అని ప్రకటనలో పేర్కొన్నారు.