దుర్గం చెరువు తీగల వంతెన షురూ

భాగ్యనగరం సిగలో మరో మణిహారంగా నిలిచే దుర్గంచెరువు తీగల వంతెన అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ దీన్ని ప్రారంభించారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో హైదరాబాద్‌కు ప్రత్యేక ఆకర్షణతోపాటు మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ మధ్య ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గనున్నాయి. 

దుర్గంచెరువుపై నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిగా రూపుదిద్దుకుంది. ఎల్‌ఈడీ లైట్ల వెలుగుల్లో వంతెన అందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.