దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తుండగా ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. ఇక కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు.
‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రానికి నిరవ్ షా సినిమాటోగ్రఫీ చేయనుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ‘తలైవి’గా వస్తున్న ఈ చిత్రం హిందీలో ‘జయ’ పేరుతో విడుదలకానుంది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలలో అసెంబ్లీలో ఆమె పై జరిగిన దాడి ఒకటి. అసెంబ్లీలో ప్రకాశ్ రాజ్, కంగనా రనౌత్ మధ్య ఆసక్తికర సన్నివేశాలు చిత్రీకరించే ప్లాన్ చేయగా, ఇందుకోసం చెన్నైలోని ఓ స్టూడియోలో భారీ అసెంబ్లీ సెట్ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.