Site icon TeluguMirchi.com

కే.సీ.ఆర్‌ తెలంగాణా పోరు యుక్తులు

kcr-kodandaram-goudతెలంగాణా సాధనే ఏకైక అజెండాగా ప్రారంభమైన రాజకీయ పార్టీ “తెలంగాణా రాష్ట్ర సమితి” అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాల్లో రాజకీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపై నడిపించేలా సమన్వయం చేకూర్చడానికి మొదలయిన వేదిక “తెలంగాణా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ”. ఈ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు… వీరిద్దరిదీ ఒకటే మాట.. ఒకటే బాణం… ఇది గతం. ఇటీవలి కాలంలో భేదాభిప్రాయాలు రావడం, ఎడమొహం పెడమొహంలా అయిపోయారు. మరీ ముఖ్యంగా సకల జనుల సమ్మె తర్వాత ఈ దోస్తీ చెడినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బాహాటంగానే వీరిద్దరి మధ్య విమర్శనాస్త్రాలు వినిపించాయి. తాజాగా కే సీ ఆర్‌ మరోమారు తన ఉద్యమ ప్రణాళికకు పదును పెట్టడం మొదలు పెట్టడంతో, మరోసారి అందరినీ కలుపుకు పోవాలని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌, తెదేపాల్లో తెలంగాణాకు అనుకూలంగా ఉన్న నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్తేశారు. అలాగే తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్ ను టీ ఆర్‌ ఎస్‌ పార్టీలో చేర్చుకుంటున్నారు. అలాగే కోదండరాం, తనకు మధ్య ఉన్న విభేదాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్తే దిశగా చర్చించడానికి శుక్రవారం సమావేశమవనున్నట్టు సమాచారం. వీరి భేటీలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. కోదండరాం, దేవీప్రసాద్, విఠల్, మల్లేపల్లి లక్ష్మయ్య, రాజేందర్‌రెడ్డి తదితరులను కేసీఆర్ తన నివాసానికి ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే మరోసారి తెలంగాణా ఉద్యమం డిసెంబర్‌ 9 దగ్గరకు వచ్చే సరికల్లా ఉవ్వెత్తున ఎగసిపడేలా కనిపిస్తోంది.

Exit mobile version