కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధిలో ఉన్న డబ్బును ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్)కు బదలాయించమని ఆదేశించజాలమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పీఎం కేర్స్ నిధి, డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేశారని, ఇందులోని డబ్బును తక్షణమే ఎన్డీఆర్ఎఫ్ కు బదలాయించాలని కోరుతూ ఓ స్వచ్చంద సంస్థ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అత్యున్నత ధర్మాసనం విచారణ జరిపింది.
పీఎం కేర్స్ నిధి, ఓ విభిన్నమైనదని అభివర్ణించిన సుప్రీంకోర్టు, ఈ నిధికి ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ లు విరాళాలను అందించాయని, అయితే, ప్రభుత్వం ఈ నిధిని విపత్తు నిధికి బదలాయించాలని భావిస్తే మాత్రం తాము అడ్డుకోబోమని, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రం మాత్రమేనని తేల్చి చెప్పింది. అయితే, ఓ అత్యవసర నిధి కింద పోగుచేసిన డబ్బును, మరో అవసరానికి వాడాలని భావించడం సహేతుకం కాదన్నది తమ అభిప్రాయమని వ్యాఖ్యానించింది.