జమైకన్ స్ప్రింటర్, ఒలింపిక్స్ లో ఏకంగా ఎనిమిది బంగారు పతకాలు సాధించి, వేగంలో చిరుతపులి అని పేరు తెచ్చుకుని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఉసేన్ బోల్ట్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన, కరోనా టెస్ట్ చేయించుకోవడంతో ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆయన, తనకు వైరస్ సోకిందని అన్నారు.
”నాకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. శనివారం నాడు పరీక్షలు చేయించుకోగా, ఖరారైంది. దీంతో నేను బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను. అందుకే నా సన్నిహితులకు దూరంగా ఉంటున్నాను. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలూ లేవు. హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. కరోనా ప్రొటోకాల్ గురించి హెల్త్ మినిస్ట్రీ నుంచి కొన్ని వివరాలను కోరాలని భావిస్తున్నాను. నా దేశ ప్రజలంతా క్షేమంగా ఉండాలి” అని అన్నారు.