Site icon TeluguMirchi.com

రివ్యూ: తుఫాన్‌

Ram-Charan-Movie-Toofan-Review-Rating

తీరప్రాంతలపై ఏమాత్రం ప్రభావం చూపని...తుఫాన్‌ |  తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.75/5

రీమేక్ క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డం, నిప్పుతో నేష‌న‌ల్ గేమ్స్ ఆడాల‌నుకోవ‌డం రెండూ ఒక్కటే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా – కొంప‌లంటుకొంటాయ్‌. పాత సినిమాల్ని, అందులోనూ క్లాసిక్ క‌థ‌ల్ని రీమేక్ చేస్తున్నామంటే… వంద రెట్ల జాగ్రత్త కావాలి! ఏదో పాత సినిమా క‌థ‌నీ, ఆ టైటిల్‌ని వాడుకొందాం అనుకొంటే జీవితంలోనే అతి పెద్ద పొర‌పాటు చేసిన‌ట్టే. తొలి సినిమాని అంద‌రూ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటారు. ఎలాంటి రిస్క్ లేకుండా ఓ సినిమా తీసేసి పాస్ మార్కులు కొట్టేద్దాం.. అనుకొంటారు. కానీ చ‌ర‌ణ్ మాత్రం బాలీవుడ్‌లో త‌న తొలి అడుగు జంజీర్ లాంటి క్లాసిక్ రీమేక్ తో వేసి పెద్ద సాహ‌సం చేశాడు. మ‌రి అందులో ఎంత వ‌ర‌కూ విజ‌యం సాధించాడు? నిప్పుతో ఆడిన ఈ గేమ్ లో చ‌ర‌ణ్‌కి ఎన్ని పాయింట్లు వ‌చ్చాయి? గెలిచాడా లేడా? చూద్దాం ప‌దండి.

విజ‌య్ (రామ్ చ‌ర‌ణ్) ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. నిజాయ‌తీకి మారుపేరు. ఎక్కడా ఓ చోట కుదురుగా ప‌నిచేయ‌డు. ట్రాన్స్ ఫ‌ర్స్ పేరుతో రాష్ట్ర్రమంతా తిరుగుతాడు. చివ‌రికి ముంబై వెళ్తాడు. అక్కడ ఆయిల్ మాఫియా రాజ్యమేలుతుంటోంది. రుద్రప్రతాప్ తేజ (ప్రకాష్ రాజ్‌) ఆ ఆయిల్ మాఫియాకి బాస్‌. ఓ పెళ్లి చూడ్డానికి మాల (ప్రియాంకా చోప్రా) అమెరికా నుంచి ఇండియా వ‌స్తుంది. ఇక్కడో హ‌త్య క‌ళ్లారా చూస్తుంది. సాక్షిని కాపాడే బాధ్యత విజ‌య్ తీసుకొంటాడు. ఆ హ‌త్య వెనుక డొంక క‌దిపితే వెయ్యి కోట్ల విలువైన ఆయిల్ మాఫియా గుట్టు బ‌య‌ట ప‌డుతుంది. దాన్ని విజ‌య్ ఎలా ఛేదించాడు, రుద్రప్రతాప్‌కి ఎలాంటి శిక్ష వేశాడు? అనేదే ఈ సినిమా క‌థ‌. విజ‌య్‌కి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది కూడా క‌థ‌లో కీల‌క‌మే.

బాలీవుడ్‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన జంజీర్‌కి రీమేక్ ఇది. అయితే ఆయిల్ మాఫియా.. అనేదే ఈ సినిమాకిచ్చిన కొత్త ట‌చ్‌. అమితాబ్‌ని యాంగ్రీ యంగ్‌మెన్‌గా తీర్చిదిద్దిన పాత జంజీర్‌…. ఇప్పుడు చ‌ర‌ణ్‌కీ కాస్తో కూస్తో హెల్ప్ అయ్యింది. ఈ సినిమాతో బాలీవుడ్‌కి ఓ యాక్షన్ హీరో దొరికాడేమో అనిపిస్తుంది. చ‌ర‌ణ్ లుక్ కొత్తగా లేక‌పోయినా.. సీరియ‌స్ టెంపో కొన‌సాగించ‌డానికి ప్రయ‌త్నించాడు. అందులో కొంత వ‌ర‌కూ విజ‌యం సాధించాడు. సినిమా మొత్తం వెదికినా చ‌ర‌ణ్ ఫేస్‌లో ఒక్క స్మైల్ కూడా వెద‌క‌లేం. స్టోరీ అలాంటిది అని స‌రిపెట్టుకోవాలి.

జంజీర్ ని చూసిన క‌ళ్లతో ఈ సినిమా చూస్తే తేలిపోవ‌డం ఖాయం. ఈతరం ప్రేక్షకుల‌కు ఈ క‌థ‌లోగానీ, ఈ సినిమాలో గానీ కొత్తద‌నం ఏమాత్రం క‌నిపించ‌దు. ఎందుకంటే ఓ నిజాయ‌తీగల హీరో – ఓ మాఫియా లీడర్‌…. వీరి మ‌ధ్య జ‌రిగిన క‌థ తెలుగు ప్రేక్షకులు చూసీ చూసీ విసిగిపోయిన‌దే. పైగా సినిమా అంతా ఒక్క లైన్ చుట్టూ తిరుగుతుంది. అదే.. ఆయిల్ మాఫియా. దాన్ని చూపించిన విధానం కూడా కొత్తగా ఏం లేదు. తొలి స‌న్నివేశాల్లో విలనిజం భీక‌రంగా చూపించి.. ఆ త‌ర‌వాత అతన్ని జోక‌ర్ స్థాయికి దించేయ‌డం ఈ సినిమాలోనూ క‌నిపిస్తుంది. పాత జంజీర్‌లో అంద‌రికీ గుర్తుండిపోయే పాత్ర షేర్‌ఖాన్‌. ఈ సినిమాలో శ్రీ‌హ‌రి ఆ పాత్ర పోషించారు. అస‌లు విజ‌య్ – షేర్‌ఖాన్ మ‌ధ్య వైరం ఎందుకు పుడుతుందో, స్నేహం ఎందుకు మొద‌ల‌వుతుందో స‌రిగ్గా చూపించ‌లేదు.

ఈ సినిమాకి ఉన్న మ‌రో ప్రధాన మైన‌స్‌…. డ‌బ్బింగ్ లుక్‌. ఏదో హిందీలో తీసిన సినిమాకి తెలుగు రూపం చూసిన‌ట్టు ఉంటుంది.. త‌ప్ప నేటివిటీ ఫీల్ రాదు. ప్రియాంకా చోప్రా చ‌ర‌ణ్‌కి ఆంటీలా క‌నిపించింది. వారిద్దరి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా గొప్పగా కుద‌ర్లేదు. ఎంత గొప్ప అంద‌గ‌త్తైనా కెమెరా స‌రిగా చూపించ‌క‌పోతే అనాకారిగా క‌నిపిస్తుంది అన‌డానికి ఈ సినిమాలో ప్రియాంకానే పెద్ద నిద‌ర్శనం. ఈ సినిమా మొత్తం ఒకే మూడ్‌లో సాగుతుంది. హిందీ వాళ్లకు ఓకే గానీ, తెలుగు ప్రేక్షకులు కాస్త కామెడీ, కాస్త గ్లామ‌ర్ ఆశిస్తారు. అవి రెండూ ఈ సినిమాలో మిస్సయ్యాయి. ప్రకాష్ రాజ్‌, వ్యాంప్ పాత్రల మ‌ధ్య న‌డిచిన డ‌బుల్ మీనింగ్ డైలాగులు ఒక్కటే కాస్త రిలీఫ్. అవి ఒక్కోసారి శ్రుతి మించాయి కూడా. ఈ సినిమాలో కాస్త బాగుంది అని చెప్పుకొనే విభాగం సంభాష‌ణ‌లు మాత్రమే. చ‌ర‌ణ్ డాన్సులు, ఫైటింగులూ చూద్దాం అని ఆశ పెట్టుకొన్న ప్రేక్షకులు బెంబేలెత్తిపోవ‌డం ఖాయం. పాట‌లు చ‌ర‌ణ్ స్టెప్పుల‌కు అనుగుణంగా లేవు.

బాలీవుడ్ టేకింగ్ ఏ రేంజులో ఉంటుంద‌ని చెప్పుకొంటారు. అది కూడా ఈ సినిమాలో నామ‌మాత్రంగా ఉంది. స్ర్కీన్‌ప్లే ట్విస్టులు లేవు. అదిరిపోయే యాక్షన్ ఘ‌ట్టాలూ కాన‌రావు. ఇవ‌న్నీ లేన‌ప్పుడు ఈ సినిమాకి యాక్షన్ లుక్ ఎక్కడి నుంచి వ‌స్తుంది, చ‌ర‌ణ్‌కి యాంగ్రీ యంగ్ మెన్ ఇమేజ్ ఎలా వ‌చ్చేస్తుంది? టెక్నిక‌ల్‌గా ఈ సినిమా నాశిర‌కంగానే ఉంది. ఆర్‌.ఆర్‌లో ఎప్పుడూ ఒకే మోత‌. ర‌ఘ‌ప‌తి రాఘ‌వ రాజారాం బిట్టు ఫైట్ సీన్ల‌లో వాడిన ఘ‌న‌త ఈ సినిమాకే ద‌క్కుతుంది.

మొత్తమ్మీద ఈదో సాదా సీదా ప్రయ‌త్నం మాత్రమే. చ‌ర‌ణ్ న‌టించిన డ‌బ్బింగ్ సినిమాలు మ‌న తెలుగు ప్రేక్షకుల‌కు చూసే అవ‌కాశం ద‌క్కదు. ఆ లోటు తీరాలంటే తుఫాన్ కి వెళ్లిరావాలి.

తెలుగు మిర్చి రేటింగ్స్: 2.75/5                                                                          -స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Review

Exit mobile version