తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5
ప్రియదర్శి హీరోగా, రూప హీరోయిన్‌గా, మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “సారంగపాణి జాతకం”. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, సీనియర్ నరేష్, వడ్లమాని శ్రీనివాస్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. మరి ప్రేక్షకులలో ఉన్న ఆసక్తిని ఈ సినిమా ఎంతవరకు క్యాష్ చేసుకోబోతోంది? సినిమా ఎలా ఉంది? ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మన రివ్యూ లో చూద్దాం.
కథ ప్రకారం, సారంగపాణి (ప్రియదర్శి) ఒక కార్ షోరూంలో సేల్స్ మాన్‌గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి తన మేనేజర్ మైథిలి (రూప) అంటే ఇష్టం ఉన్నా, ఆమె తనను పట్టించుకోదేమోనని భావిస్తూ తన మనసుకు సర్దిచెప్పుకుంటాడు. కానీ మైథిలి మాత్రం తన ప్రేమను వ్యక్తపరిచి పెళ్లికి సిద్ధమవుతుంది. ఇదే సమయంలో, జిగేశ్వరానంద (అవసరాల శ్రీనివాస్) జాతకాలు చెబుతూ సారంగపాణి భవిష్యత్తులో ఒక హత్య చేస్తాడని అతన్ని భయపెడతాడు. దీంతో మైథిలి ఒక హంతకుడి భార్య అవ్వకూడదని భావించిన సారంగపాణి, ముందుగానే ఒక బాధలేని హత్య చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో అతనికి తోడవుతాడు అతని స్నేహితుడు చంద్ర (వెన్నెల కిషోర్). వీరిద్దరూ కలిసి హత్య చేయడానికి చేసిన స్కెచ్‌లు, ప్రయోగాలు సినిమాలో కామిడీ అందిస్తాయి. చివరికి అహోబిల రావు (తనికెళ్ల భరణి) అనే వ్యక్తిని చంపమని జిగేశ్వరానంద సలహా ఇస్తాడు. తన పెళ్లి కోసం అహోబిల రావును చంపేందుకు సిద్ధమైన సారంగపాణి, చివరికి చంపగలిగాడా? లేదా? చివరికి ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
నటీనటుల విషయానికి వస్తే, ప్రియదర్శి తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. రూప కూడా చాలా సహజంగా నటించింది. అవసరాల శ్రీనివాస్ తక్కువ సీన్లలోనే తన మార్క్ చూపించాడు. తనికెళ్ల భరణి, నరేష్ వంటి అనుభవజ్ఞులు మంచి నటనను ప్రదర్శించారు. టెక్నికల్‌గా సినిమా కూడా స్టాండర్డ్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవసరమైన చోటలు తప్ప మరీ లౌడ్‌గా లేకపోవడం ప్రశంసించదగ్గ విషయం. సినిమాటోగ్రఫీ మంచి వాతావరణాన్ని అందించడంతో పాటు, ఎడిటింగ్ కూడా టైట్‌గా ఉంది. పాటలు పెద్దగా గుర్తుండిపోయేలా లేకపోయినా, డైలాగ్స్ మాత్రం ఆకట్టుకున్నాయి.
మొత్తానికి, “సారంగపాణి జాతకం” ఒక ఫన్ రైడ్ లాంటి సినిమా. ఫస్ట్ హాఫ్ హాస్యంతో సాగిపోతూ ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది. వెన్నెల కిషోర్‌తో ఉన్న సన్నివేశాలు, ఆయన డైలాగ్ టైమింగ్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ పాయింట్ కూడా బాగానే ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్లోగా అనిపించవచ్చు. అయినా క్లైమాక్స్ వరకు తీసుకెళ్లే తీరు బాగుంటుంది. ముఖ్యంగా, లాజిక్ కన్నా ఎమోషన్, వినోదం మీద ఫోకస్ పెట్టిన డైరెక్టర్ హాస్యాన్ని ఆర్గానిక్‌గా రాబట్టడంలో విజయవంతమయ్యారు అని చెప్పవచ్చు.
తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5