Site icon TeluguMirchi.com

రివ్యూ : ప్రేమ ఒక మైకం

Prema-Oka-Maikam-Telugu-Movie-Review-Rating

ప్రేక్షకుడికి మిగిలేది శోకం! ప్రేమ ఒక మైకం    :తెలుగుమిర్చి రేటింగ్‌ : 1.5/5

పోస్టర్ చూసి సినిమాకి ల‌గెత్తుకెళ్తే – బోర్లా ప‌డ‌క త‌ప్పదు అనే విష‌యం చాలా సార్లు రుజువైంది. ఏ లేబులెనుక ఏ స‌రుకుందో, ఏ టేబుల్ కింద ఏ సొరుగుందో అని – ఆశ ప‌డ‌డం, ఆన‌క జండూబామ్ డ‌బ్బుల కోసం జేబులు త‌డుముకోవ‌డం మ‌న‌కు మామూలే. వేశ్య క‌థ‌, అందులోనూ ఛార్మి హీరోయిన్ అన‌గానే – మ‌న‌సు కాస్త థియేట‌ర్ వైపుకు ప‌ద‌మంటుంది. పోస్టరు చూసి – ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఈ సినిమా చూడాల్సిందే అని డిసైడ్ అయిపోతారు. ప్ఛ్‌… తెలిసి తెలిసి సుడిగుండంలో దూకుతానంటే ఎవ‌రు మాత్రం ఏం చేస్తారు?? అదృష్టం ఏమిటంటే చూపించిన పోస్టర్ ఒక‌టి లోప‌లున్న మేట‌ర్ మ‌రోటి… అనేది సినిమా మొద‌లైన అర‌గంట‌కే తెలిసిపోతుంది. నాడి చూసి రోగం తేల్చేసిన‌ట్టు – ప్రారంభ స‌న్నివేశాలు చూసి సినిమా ఎలా ఉందో అంచ‌నా వేసే ప్రేక్షకులు కాస్తో- కూస్తో అదృష్టవంతులే. టికెట్టు రేటుకు న్యాయం చేయాల‌నే క‌క్కుర్తితో మిగ‌తా సినిమా అంతా చూస్తే.. దండేసి దండం ఎట్టేయొచ్చు. అస‌లింత‌కీ ఈ మ‌హ‌త్తర ప్రేమ కావ్యం ప్రేమ ఒక మైకంలో ఏముంది? చూద్దాం ప‌దండి.

మ‌ల్లిక ( ఛార్మి) ఒక వేశ్య‌. డ‌బ్బు తీసుకోవ‌డం, సుఖం అందించ‌డం అంతే.. త‌న ప‌ని. జీవితంపై ఎలాంటి భావాలూ, ఆశ‌లూ ఉండ‌వు. ఎప్పుడూ మందు బాటిల్ చేతిలో ఉంటుంది. మైకంలో ఊగుతుంటుంది. ఆ మైకంలో ల‌లిత్ (రాహుల్‌)ని యాక్సిడెంట్ చేస్తుంది. ఆ ప్రమాదంలో ల‌లిల్‌కి రెండుక‌ళ్లూ పోతాయి. త‌న‌ని ఇంటికి తీసుకొస్తుంది. ల‌లిత్ ఓ ర‌చ‌యిత‌. అత‌ని భావాలు, క‌విత‌లూ మ‌ల్లిక‌లో మార్పు తీసుకొస్తాయి. ఆడ‌ది ఎలా ఉండాలో ల‌లిత్ పాట‌ల ద్వారా తెలుసుకొంటుంది. జీవితం అంటే ఇది కాదు, ఇంత‌కు మించి ఏదో ఉంది అనే సంగ‌తి అర్థమ‌వుతుంది. ల‌లిత్ డైరీ ద్వారా అత‌నికి ఓ ప్రేమ క‌థ ఉంద‌ని తెలుసుకొంటుంది. ల‌లిత్ ప్రేమించింది ఎవరిని? అత‌నికి క‌ళ్లొచ్చాయా? మ‌ల్లిక మ‌నిషిలా మార‌డానికి ఏం చేసింది? అనేదే ఈ సినిమా క‌థ‌.

ఈ సినిమా అంతా త్యాగాల మ‌య‌మే. స్నేహం కోసం ల‌లిత్ ప్రేమను త్యాగం చేస్తాడు. ల‌లిత్ కోసం మ‌ల్లిక త‌న జీవితాన్ని త్యాగం చేస్తుంది. ఇంత ` (శిరో) భార‌మైన క‌థ‌` ఈ మ‌ధ్య కాలంలో రాలేదేమో..? వేశ్య పాత్రతో న‌డిచే సినిమా అన‌గానే కాస్త గ్లామర్‌, ఇంకాస్త నిషా ఆశిస్తారు. ప్రారంభ స‌న్నివేశాలు దానికి త‌గ్గట్టే సాగాయి. ఛార్మి నిర్లక్ష్యపు చూపులు, ఆమె సంభాష‌ణ‌లూ వేశ్య సినిమా కొల‌త‌ల ప్రకారం సాగుతాయి. అయితే ల‌లిత్ పాత్ర ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో, అత‌నికో భ‌యంక‌ర‌మైన ఫ్లాష్ బ్యాక్ ఉంద‌ని తెలిసిందో – అక్కడి నుంచి – క‌థ నీర‌సం ఆవ‌హించి, నిర్లిప్తంగా, నిరాస‌క్తతో సాగుతుంటుంది. నిజానికి ఇది ఛార్మి సినిమా కాదు, ఆమె కేవ‌లం ఓ గెస్ట్ రోల్‌. ల‌లిత్ ఫ్లాష్ బ్యాక్‌, అత‌ని ల‌వ్ స్టోరీ – ఇవి స‌రిపోద‌న్నట్టు మ‌రో పిట్ట క‌థ – ఇవ‌న్నీ క‌లిసి – ఈసినిమా లో ఛార్మి ఉండాలి క‌దా? ఆమె ఏమైంది?? అనే అనుమానం ర‌ప్పిస్తుంది. చివ‌ర్లో మ‌ళ్లీ ఛార్మి ప్రత్యక్ష్యమ‌వుతుంది. ఆమె చేత ద‌ర్శకుడు భారీ త్యాగం చేయించి, క‌థ‌కో డ్రమ‌టిక్ ముగింపు ఇచ్చేశాడు.

ఛార్మికి ఈ సినిమా ప్లస్ అవుతుంది, ఆమెకు అవార్డులొస్తాయి – అని ద‌ర్శకుడు చందూ టామ్ టామ్ చేశాడు. నిజ‌మే కామోసు అనుకొంటే మ‌ల్లిక పాత్రకు అంత సీన్ లేదు. నిజానికి వేశ్య పాత్రలు అవార్డుల‌కు రాచ మార్గాలు. కాస్త గ్లామ‌ర్‌, ఎక్కువ భావోద్వేగాలూ – ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి పండించొచ్చు. కానీ ఈ సినిమాలో ఈ రెండింటికీ క‌ర‌వొచ్చింది. హ‌స్కీ గొంతుతో మాట్లాడితే, చేతిలో ఎప్పుడూ మందు బాటిల్ ప‌ట్టుకొని క‌నిపిస్తే పాత్రలో డెప్తు క‌నిపిస్తుంద‌ని ద‌ర్శకుడు భావించి ఉంటాడు. ఛార్మిని ఏ స‌న్నివేశంలో చూసినా చేతిలో మందు గ్లాసుతోనే ద‌ర్శన‌మిస్తుంది. ఇక రాహుల్ న‌ట‌న‌లో ఇంకా క్లారిటీ రావాలి. అత‌నిపై క్లోజ‌ప్ షాట్ పెట్టడానికి దర్శకుడు, పెడితే చూడ్డానికి ప్రేక్షకుడు భ‌య‌ప‌డ్డారు. శ‌ర‌ణ్య కూడా తేలిపోయింది. పాటల్లో లిప్ సింక్ మరీ దారుణం. ఉన్నంత‌లో రావు ర‌మేష్ ఫ‌ర్లేదు, చంద్రమోహ‌న్‌నీ స‌రిగా ఉప‌యోగించుకోలేదు. తాగుబోతు ర‌మేష్ సేమ్ టూ సేమ్!!

సినిమాలో వినోదానికి ఛాన్స్ త‌క్కువ‌. ప్రేక్షకుల‌ను ఏడిపించ‌డ‌మే ప‌నిగా పెట్టుకొంటే – ఆ సినిమాలో న‌వ్వుల‌కు ఛాన్స్ ఎక్కడిది? అయినా మల్లిక అంత త్యాగం చేయాల్సిన అవ‌స‌రం లేదు. త‌న జీవితాన్ని మ‌రో ర‌కంగా సార్థకం చేసుకోవ‌చ్చు. విషాదంత‌మైన కథ‌లు బాగా గుర్తుండిపోతాయని ద‌ర్శకుడు భ్రమ ప‌డి ఉంటాడు. నూటికి నూరు పాళ్లూ ఇది చందూ వైఫ‌ల్యమే. క‌థ‌లోనే విష‌యం లేదు. ఏమాత్రం ప‌స లేని క‌థ‌ని పట్టుకొని దాని నుంచి డ్రామా సృష్టించాల‌నుకొన్నాడు. మాట‌ల ర‌చ‌యిత పులగం చిన్నారాయ‌ణ మాత్రం క‌ష్టప‌డ్డాడు. తొలి అవ‌కాశం క‌దా..? స‌ద్వినియోగం చేసుకోవాల‌నే త‌ప‌న క‌నిపించింది. ఛార్మి – ర‌విబాబు, ఛార్మి – రావు ర‌మేష్ మ‌ధ్య నడిచే స‌న్నివేశాల్లో అత‌ని ప‌నిత‌నం క‌నిపించింది. అంద‌గ‌త్తెలంద‌రూ మంత్రగ‌త్తెలే అన‌డం బాగుంది. ఇలాంటి మెరుపులు అక్కడ‌క్కడ ప‌డ్డాయి. కానీ ఎంత రాస్తే ఏం లాభం? శ‌వానికి ఆక్సిజ‌న్ ఎక్కించాల‌ని తాప‌త్రయ ప‌డిన‌ట్టే..! సంగీతం, ఛాయాగ్రహ‌ణం – ఇవి కూడా అంతంత మాత్రమే. కొన్నిస‌న్నివేశాల‌ను ఎడిట్ చేసుకోవాల్సిందే.

ప్రేమ ఒక మైకం అనే టైటిల్ పెట్టడానికి కార‌ణం ఏమిటో ద‌ర్శకుడికే తెలియాలి. ఏదో చేద్దామనుకొని రంగంలో దిగిన ద‌ర్శకుడు, ఇలాంటి సాదాసీదా క‌థ‌తో ఏమీ చేయ‌లేక ఉసూరుమ‌నిపించాడంతే.

తెలుగు మిర్చి రేటింగ్స్: 1.5/5                                                                                 -స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Exit mobile version