రివ్యూ : నేనేం చిన్నపిల్లనా?

nenem-chinna-pillana-movie-review
అమ్మమ్మ కాలం నాటి క‌థ‌ నేనేం చిన్నపిల్లనా? తెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5

అన‌గ‌న‌గా ఒక రాజు, ఆ రాజుకి ఏడుకొడు కొడుకులు.. వారంతా ఓ రోజు వేట‌కెళ్లారు…..
– అమ్మమ్మో, తాతయ్యో తొలిసారి ఇలాంటి క‌థ చెబితే, విన‌డానికి భ‌లే బాగుంటుంది, ఆస‌క్తిగా కూడా ఉంటుంది. రెండో రోజూ ఇదే క‌థ చెబితే, మూడో రోజూ ఇదే క‌థ‌ని మ‌రోసారి తిప్పి చెబితే – నాలుగుసారి విన‌డానికి మ‌న‌కే విసుగొస్తుంది. అయిదోసారి కూడా `అన‌గ‌న‌గా ఓ రాజు.. ఆ రాజుకి..` అన‌గానే చిర్రెత్తుకొస్తుంది. క‌థ మంచిదే, నీతి ఉంది, ఇంట్రస్ట్‌గా ఉంది – కానీ మ‌ళ్లీ మ‌ళ్లీ అదే కథ ఎలా వినేది? ఫ్రీగా చెప్పే క‌థ‌ల్లోనే వెరైటీ కోరుకొంటే – డ‌బ్బులిచ్చి చూసే సినిమాలో ఇంకెంత వెరైటీ కోరుకొంటాడు ప్రేక్షకుడు..? అయినా ఈ సంగ‌తేం ప‌ట్టించుకోకుండా, నాకు ఇదే వ‌చ్చు, చూస్తే చూడండి అంటే – ఆ ప్రేక్షకుడికి దిక్కెవ‌రు..? నేనేం చిన్నపిల్లనా సినిమాలో ఉన్న క‌థ కూడా – వినీ వినీ విసిగిపోయిన పురాత‌న‌కాలం నాటి కథే.

స్వప్న (త‌న్వీ) ఉమ్మడి కుటుంబంలోని అనురాగాలు, ఆప్యాయ‌త‌ల మ‌ధ్య పెరుగుతుంది. అన్నీ ఉన్నాయ్‌. కానీ స్వేచ్ఛ లేద‌నేది త‌న బాధ‌. త‌న కోరిక‌ల‌కు క‌ళ్లెం వేస్తున్నార‌ని కోపం. అందుకే చ‌దువు పేరు చెప్పి స్వీడ‌న్ వ‌చ్చేస్తుంది. ఇక్కడ క్రిష్ (రాహుల్ ర‌వీంద్రన్‌) ప‌రిచ‌యం అవుతాడు. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో బాగా తెలిస‌న వ్యక్తి. త‌న కోస‌మే బ‌తుకుతాడు. క్రమంగా స్వప్న‌, క్రిష్ ల‌మ‌ధ్య స్నేహం పెరుగుతుంది. అది ప్రేమ‌కు దారితీస్తుంది. ఈలోగా స్వప్న ఇండియా వ‌స్తుంది. త‌న‌తో పాటు క్రిష్ కూడా వ‌స్తాడు. ఇక్కడ స్వప్న ఇంట్లోవాళ్లతో క్రిష్ గొడ‌వ ప‌డ‌తాడు? దానికి కార‌ణం ఏమిటి?? అస‌లు క్రిష్ ఎవ‌రు?? అత‌నికి కుటుంబం ఉందా? స్వప్న ఆలోచ‌న‌ల్లో వ‌చ్చిన మార్పేంటి? దానికి ఎవ‌రు కార‌ణం.. వీటితో అల్లుకొన్న క‌థ‌.. నేనేం చిన్నపిల్లనా??

సునీల్ కుమార్ రెడ్డి ఇప్పటి వ‌ర‌కూ దాదాపుగా ఆఫ్ బీట్ క‌థ‌ల‌నే డీల్ చేశాడు. ఈ త‌ర‌హా ఫ్యామిలీ డ్రామా టేక‌ప్ చేయ‌డం ఇదే తొలిసారి. అందుకే ఆ త‌డ‌బాటు పూర్తిగా క‌నిపించింది. ఇంత‌మంది ఆర్టిస్టుల్ని ఎలా వాడుకోవాలో ఆయ‌నకు అర్థం కాలేదు. టీవీ సీరియ‌ల్స్ కి జ‌నాలు అతుక్కుపోతున్నారు క‌దా.. అలాంటి క‌థ‌నే సినిమా తీస్తే – అదే జ‌నం తండోప‌తండాలుగా వ‌స్తారు అనుకోవ‌డం పొర‌పాటు. మ‌హిళా ప్రేక్షకులు బుల్లితెర‌కు అతుక్కుపోయారు. సినిమా చూడ్డానికి వ‌స్తోంది.. యువ‌త‌రమే. వాళ్లని ఆకట్టుకొనే అంశాలు ఉంటేనే ఏ సినిమా అయినా నిల‌బ‌డుతుంది. ఆ విష‌యాన్ని గాలికి వ‌దిలేశాడు ద‌ర్శకుడు. లవ్ ట్రాక్‌తో యూత్‌ని సంతృప్తిప‌రుద్దామ‌నుకొన్నా.. ఆ ట్రాక్ కూడా ఈ సినిమాలో త‌ప్పింది.

తొలిభాగం ఫ‌ర్లేదులే.. సోసో అనుకొనేలా ఉంటుంది. పైగా క‌థ‌లో ఓ ట్విస్టు! దాంతో సెకండాఫ్ పై కొన్ని ఆశ‌లు పెరుగుతాయి. పైగా రామానాయుడి గారి సినిమా కదా.. అదే దీమా ఒక‌టి. కానీ దాన్ని కూడా ద‌ర్శకుడు తుత్తునీలు చేశాడు. రెండో భాగం అయితే ఇంకా ఘెరం. సెంటిమెంట్, క‌న్నీళ్లు, క‌ష్టాలూ క‌ల‌గ‌లిపి కొట్టాడు. ఇలాంటి స‌న్నివేశాలు టీవీలో వ‌స్తేనే ప‌ర‌మ బోరింగ్ గా ఉంటాయి. వాటిని డ‌బ్బులిచ్చి మ‌రీ వెండి తెర‌పై చూసే ధైర్యం, ఓపిక ఎవ‌రికి ఉన్నాయి…? రాహుల్ బాగా చేశాడు. తొలి రెండు సినిమాలలో ఏమైనా త‌ప్పులు చేసుంటే.. ఈ సినిమాలో వాటిని క‌వ‌ర్ చేసుకొన్నాడు. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో అత‌ని న‌ట‌న బాగుంది. ఇక ఈసినిమాలో కీ రోల్ త‌న్వీది. ద‌ర్శకుడు ఈ పాత్ర ఎంపిక‌లోనే పెద్ద త‌ప్పు చేశాడు. రాహుల్‌కి అక్కలా ఉండే త‌న్వీని ఎలా ఎంచుకొన్నారో మ‌రి.? అద్భుత‌మైన నటనా?? అంటే అదీ లేదు. కొన్ని చోట్ల లిప్ సింక్ ఏమాత్రం కుద‌ర్లేదు. దాంతో స‌హ‌జ‌త్వం పోయి.. త‌న్వి ఉన్న ఏ స‌న్నివేశాన్నీ ఆస‌క్తిగా చూళ్లేం. సినిమాలో ప్రధాన పాత్ర తీరే ఇలా ఉంటే, ఇక సినిమా మాటేంటి??

ఎల్బీ శ్రీ‌రామ్ పాత్ర మాత్రం గుర్తుండిపోతుంది. ఆయ‌న నుంచి వ‌చ్చే సంభాష‌ణ‌లే ప్రేక్షకుల‌కు రిలీఫ్‌. శ‌ర‌త్ బాబు, సుమ‌న్, ఆమ‌ని… వీళ్లంతా సీనియర్లే కాబ‌ట్టి – వారి వారి పాత్రల‌కు త‌గిన న్యాయం చేశారు. మిగ‌తా వాళ్లు ఎదో ఉన్నారంతే! ఈ సినిమాలో క‌థ‌తో సంబంధం లేన‌ట్టుండే సీన్లు చాలా ఉన్నాయి. వాటిని హ‌రిహ‌రించ‌లేక‌పోయాడు ద‌ర్శకుడు. సెకండాఫ్ ని కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. శ్రీ‌లేఖ ఎప్పట్లా ఏజ్ ఓల్డ్ ట్యూన్స్‌ని అందివ్వడంలో త‌న శక్తివంచ‌న లేకుండా కృషి చేసింది. ద‌ర్శక‌త్వ ప‌రంగా ఈ సినిమాకి పాస్ మార్కులు వేయ‌డ‌మే ఎక్కువ‌.

ఏ త‌రం ప్రేక్షకుడైనా కొత్తద‌న‌మే కోరుకొంటున్నాడు. దాన్ని అందివ్వాల్సిన బాధ్యత ద‌ర్శక నిర్మాత‌ల‌దే. క్లీన్ సినిమాలు ఇవ్వాల‌న్న త‌పన నూటికి నూరుపాళ్లు మంచిదే. కానీ.. పాతత‌రం క‌థ‌ల్ని మళ్లీ మ‌రోసారి చెప్పాలి అనుకొంటే పొర‌పాటు. సినిమాకి కావ‌ల్సింది ఎంట‌ర్‌టైన్ మెంట్‌. ఎలాంటి క‌థ అయినా…. వినోదం జోడించి చెప్పాలి. ఏడుపులూ పెడ‌బొబ్బలు చూడ్డానికి థియేట‌ర్లకు ఎవ‌రొస్తారు..? పోనీ ఫీల్ గుడ్ మూవీ అనుకొందామ‌న్నా.. ఈసినిమాలో ఆ పీల్ లేదు. మొత్తానికి అటు వినోదానికీ, ఇటు ఫీల్ గుడ్ భావ‌న‌కూ దూర‌మైపోయింది ఈ సినిమా.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5                                                           -స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.