రివ్యూ : ఖైదీ నెం 150 – ఫ్యాన్స్ కు ఫుల్ భోజనమే..

టైటిల్ : ఖైదీ నెం 150 (2017)
స్టార్ కాస్ట్ : చిరంజీవి , కాజల్ , తరుణ్ అరోరా , అలీ , పోసాని తదితరులు.
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : వివి .వినాయక్
నిర్మాతలు: రామ్ చరణ్
మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్
విడుదల తేది : జనవరి 11, 2017
తెలుగు మిర్చి రేటింగ్ : 3.75/5

రివ్యూ : ఖైదీ నెం 150 – ఫ్యాన్స్ కు ఫుల్ భోజనమే..

khaidi-telugu-rating

2007 లో శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తో అభిమానులకు బై..బై చెప్పిన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ 2017 లో ఖైదీ నెం 150 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..దాదాపు 9 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి రి ఎంట్రీ ఇవ్వడం , అది కూడా తమిళం లో సూపర్ హిట్ సాధించిన కత్తి చిత్రానికి రీమేక్ తో రావడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు..

తనకెరియర్ లోనే ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వినాయక్ , ఈ ఖైదీ కి దర్శకత్వం వహించడం , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి కొణెదల ప్రొడక్షన్ ఫై తన మొదటి చిత్రం చిరు తో చేయడం , ఇక దేవి శ్రీ మ్యూజిక్ అందించడం వంటివి కూడా సినిమా అంచనాలు పెరగడానికి కారణాలు గా చెప్పుకోవచ్చు ..ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ మూవీ ఎంత వరకు విజయం సాధించింది..? అభిమానుల ఆకలి ఎంత వరకు తీర్చింది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

కత్తి శీను (చిరంజీవి ) జైలు నుండి తప్పించుకొని బ్యాంకాక్ వెళ్లదామని ఎయిర్ పోర్ట్ కు వస్తాడు..అక్కడే శ్రీను లక్ష్మి (కాజల్ ) ను చూసి , చూసిన మొదటి చూపులోనే ఆమె ప్రేమలో పడతాడు. ఆ తర్వాత బ్యాంకాక్ కు వెళ్లకుండా ఆమె చుట్టూ తిరగడం మొదలుపెడతాడు..ఈ లోపు అనుకోకుండా అతడి మాదిరిగా ఉండే శంకర్ (చిరంజీవి ద్విపాత్రాభినయం) ను ప్రమాదం నుండి కాపాడి హాస్పటల్ లో చేరుస్తాడు..ఇతడు ఎవరా అని ఆరా తీసేలోపే అతడి గురించి శ్రీను కు తెలుస్తుంది..

శంకర్ రైతుల భూముల కోసం పోరాటం చేసే యోధుడని, అతడిని కొందరు తమ అవసరాల కోసం చంపాలని చూస్తున్నారని తెలుసుకున్న శ్రీను , శంకర్ గా మారతాడు..ఆలా మారిన శ్రీను రైతుల కోసం ఏం చేస్తాడు..రైతుల భూముల్ని కాజేసి.. అక్కడో శీతల పానీయాల కంపెనీని పెట్టాలనుకున్న అధిపతి అగర్వాల్(తరుణ్ అరోరా) ను ఎలా అంతం అందిస్తాడు…? శ్రీను ..శంకర్ లు ఎలా కలుస్తారు…? లక్ష్మీ.. కత్తి శ్రీనుల ప్రేమకథ ఏమైంది? అసలు శ్రీను మొదట జైలు కు ఎందుకు వెళ్ళతాడు..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే..

ప్లస్ :

* చిరంజీవి యాక్టింగ్ , డాన్స్ , ఫైట్స్

* స్టోరీ – స్క్రీన్ ప్లే

* కాజల్ గ్లామర్

* దేవి శ్రీ మ్యూజిక్

మైనస్ :

* విలన్ రోల్

* అక్కడక్కడా కొన్ని సీన్స్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* చిరంజీవి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కాకపోతే 9 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరు రీ ఎంట్రీ ఇవ్వడం తో అందరిలో తన యాక్టింగ్ గురించి , డాన్స్ , ఫైట్స్ గురించి ఒక టెన్షన్ పెట్టుకున్నారు..అదేంటి అంటే చిరు ఇంద్ర , ఠాగూర్ రేంజి లో డాన్స్ లు , ఫైట్స్ చేస్తాడా లేక చేయలేడా అని సందేహం లో ఉన్నారు..కానీ ఖైదీ లో చిరు ను చూస్తే ఇంద్ర , ఠాగూర్ కాదు అంతకు ముందు చేసిన చూడాలని ఉంది, అన్నయ్య సినిమాలు గుర్తుకొస్తాయి..అదే స్టయిల్ , అదే డాన్స్ , అదే ఫైట్స్ , కామెడీ కూడా అరిపించాడు..

* ఇక కాజల్ కూడా తన అందచందాల తో బాగానే ఆకట్టుకుంది…కథలో పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ చిరు తో సమానంగా డాన్సులు వేసి బాగానే కష్టపడింది..

* ‘చూడాలనివుంది’ సినిమాలో చిరుకి జంటగా అంజలా జవేరి నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది ..ఆ అంజలి జవేరి భర్త తరుణ్ అరోరా నే ఈ ఖైదీ మూవీ లో విలన్ గా నటించాడు. తమిళంలో నీల్ నితిన్ ముఖేష్ చేసిన ఆ పాత్రను.. తెలుగులో తరుణ్ అరోరా చేసాడు. తన వయసు కంటే చాలా పెద్దవయసు పాత్రను ఈ సినిమాలో పోషించడం జరిగింది..తెలుగు లో మొదటి సినిమా అయినా ఎక్కడ కూడా ఆ ఛాయలు కనిపించకుండా బాగానే కవర్ చేసాడు..యాక్టింగ్ , ఫైట్స్ లలో బాగానే ఆకట్టుకున్నాడు.ఈ చిత్రం తర్వాత మరిన్ని అవకాశాలు తెలుగు లో రావొచ్చు.

* చాలారోజుల తర్వాత బ్రహ్మానందం నవ్వులు కురిపించాడు..అదుర్స్ మూవీ లో ఎలాంటి హాస్యం పండించాడు అదే మాదిరి ఈ మూవీ లో కూడా బ్రహ్మి విశ్వరూపం చూపించాడు..ముఖ్యం గా చిరు – బ్రహ్మి ల మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.

* అలాగే అలీ , పోసాని కృష్ణమురళి నటన కూడా ఆకట్టుకుంది. ఇక రత్తాలు అంటూ రాయ్ లక్ష్మి స్పెషల్ సాంగ్ అదిరిపోయింది..ఈ సాంగ్ లో చిరు అదిరిపోయే స్టెప్స్ వేసాడు..ఈ స్టెప్పులకు థియేటర్ అంత ఈలలతో మారుమోగిపోయింది..మిగిలిన నటి , నటులంతా తమ తమ పరిధి మేరకు బాగా చేసి ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* ముందుగా సినిమాటోగ్రఫీ రత్నవేలు గురించి చెప్పుకోవాలి..సినిమాని ఎంత చక్కగా చూపించాడో మాటల్లో చెప్పలేం..చిరంజీవిని , కాజల్ ను మరింత గ్లామర్ గా వెండి తెర ఫై చూపించి నిర్మాత , దర్శకుడు తన ఫై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రతి ఫ్రేమ్ లోను , సాంగ్స్ లొకేషన్స్ లో కానివ్వండి , ఫైట్స్ లలో , మిగతా సీన్స్ లలో ఎక్కడ కూడా తన నుండి ఇది బాగాలేదు అనిపించుకోకుండా చాల జాగ్రత్తగా తన కెమెరాపనితనాన్ని అందించాడు.

* మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ..దేవి మ్యూజిక్ ఎలా ఉంటుందో..ఇక మెగా హీరోలకు అతడు అందించే మ్యూజిక్ గురించి చెప్పనవసరం లేదు..ముఖ్యం గా ఈ మూవీ లో అన్ని సాంగ్స్ కుమ్మేసాడు..ఇక రత్తాలు సాంగ్ కు చిరు స్టెప్స్ అదిరిపోయాయి..ఇద్దరుకూడా కుమ్మేసారనే చెప్పాలి..నీరు మీరు అనే సాంగ్ కు అయితే ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటేనే కంటతడి వచ్చింది..సాంగ్స్ మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టాడు.

* గౌతమ్ రాజు ఎడిటింగ్ కూడా బాగుంది..అక్కడక్కడా కాస్త తన కత్తెరకు పనిచెపితే బాగుండు అనిపించింది కానీ ఓవరాల్ గా ఓకే.. పరుచూరి బ్రదర్స్ , సాయి మాధవ్ బుర్ర , వేమా రెడ్డి అందించిన డైలాగ్స్ కూడా ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాయి..

ముఖ్యం గా “మా వాళ్ళనే కొడతావా..? హీరో అనుకుంటున్నావా..? ఏంటి నీ పొగరు..? అంటే దానికి చిరంజీవి- పొగరు నా ఒంట్లో ఉంటుంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది ” , “కార్పొరేట్ బీరు తాగిన బాడీ నీది. కార్పొరేషన్ నీరు తాగిన బాడీ నాది ఆఫ్టర్ ఏ గ్యాప్.. బాస్ ఈజ్ బ్యాక్ ” అని చిరు చెప్పిన డైలాగ్ కేక పుట్టించింది. ఇవీ షాంపిల్ మాత్రమే. అసలు సిసలు డైలాగ్స్ మెగా ఖైదీలో ఇంకా ఉన్నాయ్..

* ప్రొడక్షన్ హౌస్ విషయానికి వస్తే మొదటిసారి రామ్ చరణ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు..కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో తన మొదటి చిత్రాన్ని తన తండ్రి 150 మూవీ చేయడం చాల గొప్ప విషయం. ఎక్కడ కూడా ఏ విషయం లో కూడా రాజీ పడకుండా సినిమా చాల అద్భుతంగా తెరకెక్కించాడు. స్టార్ నటి , నటులతో పాటు , టాప్ టెక్నిషన్స్ సెలెక్ట్ చేసుకొని సక్సెస్ సాధించాడు..కేవలం సినిమాను నిర్మించడమే కాకుండా అంతే లెవల్లో జనాల్లోకి సినిమాని ప్రమోట్ చేసి నిర్మాతగా సక్సెస్ అయ్యాడు.

* ఇక డైరెక్టర్ వివి .వినాయక్ ..చిరంజీవి ని అన్నయ్య గా పిలిచే వినాయక్ , ఆ అన్నయ్య 150 మూవీ ఎలా తీస్తే బాగుంటుంది..అభిమానులకు ఎలా అన్నయ్యను చూపించాలి..అన్నయ్య కు తగిన ఫైట్స్ , డాన్స్ , సెంటిమెంట్స్ , కామెడీ ఇలా అన్ని సమపాలనలో చూపించి సక్సెస్ అయ్యాడు.

చివరిగా :

9 ఏళ్ల గ్యాప్ తర్వాత ఖైదీ తో చిరు రీ ఎంట్రీ ఇవ్వడం తో అభిమానులే కాక సినీ ఇండస్ట్రీ సైతం ఈ మూవీ ఫై ఎన్నో అంచనాలు పెట్టుకుంది..ఆ అంచనాలు అందుకోవడం లో చిరంజీవి సక్సెస్ అయ్యాడని చెప్పాలి.. కత్తి శ్రీను ..శంకర్ లుగా రెండు పాత్రల్లో చిరంజీవి అదరగొట్టాడు..ఇక డాన్సుల్లో , ఫైట్స్ , కామెడీ లలో తన మార్క్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు..

‘అమ్మడూ.. లెట్స్‌డూ కుమ్ముడూ’ పాటలో రామ్‌చరణ్‌ , చిరు తో స్టెప్స్ వేయడం అభిమానుల సంబరాలు మాములుగా లేవు..అలాగే జడ్జ్ పాత్రలో నాగబాబు కనిపించడం , వినాయక్ సైతం ఓ చిన్న రోల్ లో దర్శనం ఇవ్వడం సినిమాకు అదనపు ఆకర్షణ.

డైరెక్టర్ గా వినాయక్ సినిమాని చాల బాగా తీసాడని చెప్పాలి..కథలో ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా కామెడీ , సాంగ్స్ తో నడిపిస్తునే ప్రస్తుతం రైతులు ఎదుర్చుకుంటున్న సమస్యను ఎంతో చక్కగా తెరకెక్కించి , చిరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు..ఓవరాల్ గా తొమ్మిది సంవత్సరాల తరవాత ‘బాస్‌’ ను ఎలా చూడాలనుకున్నారో ఆలా చూస్తారు..ఇక మెగా అభిమానులకు చక్కటి బిర్యానీ దొరికినట్లే…