Site icon TeluguMirchi.com

రివ్యూ: గీతాంజ‌లి

geethanjali-review                                               |Click here for English Review|
న‌వ్విస్తూ భ‌య‌పెట్టిన‌గీతాంజ‌లి |  రేటింగ్ : 3.25/5

హార‌ర్ సినిమాల ప‌ని అయిపోయింది, వ‌ర్మ లాంటివాళ్లు తీసినా జ‌నం లైట్ తీసుకొంటున్నారు.. అనుకొంటున్న ద‌శ‌లో దెయ్యం క‌థ‌లు కొత్త రూపు సంత‌రించుకోవ‌డం మొద‌లెట్టాయి. హాలీవుడ్‌కి ప‌రిమిత‌మైన హార‌ర్, కామెడీ జోన‌ర్‌… క్ర‌మంగా బాలీవుడ్‌కూ, అక్క‌డి నుంచి టాలీవుడ్ కీ పాకింది. ప్రేమ క‌థా చిత్ర‌మ్ ఓ మంచి ఉదాహ‌ర‌ణ‌. హార‌ర్‌లో కామెడీని ఎలా మిక్స్ చేయాలో చూపించిన సినిమా ఇది. నిర్మాత‌ల‌కూ బాగానే గిట్టుబాటు అయ్యింది. మ‌ళ్లీ ఆ స్థాయిలో ప్ర‌య‌త్నాలు సాగ‌లేదు. ఇప్పుడొచ్చిన గీతాంజ‌లి మాత్రం ఆ మార్క్‌ని అందుకొని ప్రేక్ష‌కుల్ని భ‌య‌పెడ‌తూ న‌వ్వించింది.. న‌వ్విస్తూ భ‌య‌పెట్టింది. ఓ ద‌ర్శ‌కుడు, అనుభ‌వం ఉన్న ర‌చ‌యిత క‌ల‌సి చేసిన ఈ చిత్రం ఎలా సాగింది?? ఇందులో భ‌యం, వినోదం పాళ్లు ఎంతెంత? తెలుసుకొందాం ప‌దండి.

శ్రీ‌ను (శ్రీ‌నివాస్‌రెడ్డి)కి ద‌ర్శ‌కుడు కావాల‌న్న‌ది ల‌క్ష్యం. నందిగామ నుంచి హైద‌రాబాద్ వ‌స్తాడు. ఇక్క‌డ ఎంత‌మందిని క‌లిసినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ర‌మేష్ రావ్ (రావుర‌మేష్‌) ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్‌. సినిమా ప‌రిభాష‌లో మాట్లాడుతుంటాడు. కార‌ణం.. అత‌నికి సినిమాలంటే పిచ్చి. ఒక్క సినిమా అయినా తీసి, దానితో నంది అవార్డ్ అందుకోవాల‌న్న‌ది ఆశ‌. ర‌మేష్ రావ్‌ని క‌లుసుకొని త‌న క‌థ చెప్ప‌డం ప్రారంభిస్తాడు శ్రీ‌ను.

అది ఓ దెయ్యం క‌థ‌. ఓ ఆపార్ట్‌మెంట్‌లో కొత్త‌గా చేరిన స్నేహితుల‌కు.. రాత్రిళ్లు ర‌క‌ర‌కాల చ‌ప్పుళ్లు వినిపిస్తుంటాయి. ఓ ఆకారం భ‌య‌పెడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఓ అమ్మాయి ఉరిపోసుకొని చ‌నిపోయింద‌ని, ఆ ఆత్మే ఆ ఇంట్లో తిరుగుతోంద‌న్న‌ది ఓ న‌మ్మ‌కం. ఆ ఇంటికి ప్ర‌తిరోజూ రాత్రి 11 గంట‌ల‌కు అంజ‌లి (అంజ‌లి) అనే ఓ అమ్మాయి వ‌స్తుంటుంది. ఆ రూమ్‌మేట్స్‌తో ఫ్రెండ్ షిప్ చేసుకొని… వారి చేత్తో కాఫీ తాగి వెళ్తుంటుంది. చివ‌రికి ఓ రోజు… ఆ స్నేహితుల‌కు ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఆ ఇంట్లో చ‌నిపోయింది ఎవ‌రో కాదు… అంజ‌లినే అని. ఇంత‌కీ అంజ‌లి క‌థేంటి? ఆ ఇంట్లో ఎందుకు చ‌నిపోయింది? ఈ స్నేహితుల చుట్టూ ఎందుకు తిరుగుతోంది? అన్న‌వి స‌స్పెన్స్‌. ఈ క‌థ చెప్పి… ర‌మేష్ రావుని మెప్పిస్తాడు. మ‌రి సెకండాఫ్ ఏది?? అని అడిగితే.. అప్పుడు మ‌రో షాకింగ్ న్యూస్ చెబుతాడు శ్రీ‌ను. అదేంటి?? ఈ దెయ్యం క‌థ‌కీ ఆ శీనుకీ ఏమైనా సంబంధం ఉందా?? అన్న‌ది మ‌రో ట్విస్టు. ఈ చిక్కుముడులు వీడాలంటే గీతాంజ‌లి చూడాల్సిందే.

బేసిగ్గా దెయ్యం క‌థ‌లు ఎలా సాగుతాయ్‌? అకార‌ణంగా చ‌నిపోయిన ఓ అమ్మాయి దెయ్యంలా మారి ప‌గ తీర్చుకొంటుంది. ఇదే లైన్ చుట్టూ ఎన్నో సినిమాలొచ్చాయి. గీతాంజ‌లి లైన్ కూడా ఇదే. అయితే ద‌ర్శ‌కుడు, క‌థ‌కుడు ఈ లైన్‌ని కాస్త తెలివిగా రాసుకొన్నారు. కొన్ని ట్విస్టులు జోడించి, వినోదాల పూత పూసి హాయిగా న‌డిపించేశారు. దాంతో ఓ కొత్త సినిమాని చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. చీక‌ట్లో కెమెరాని ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిప్పుతూ… భ‌యంక‌ర‌మైన శ‌బ్దాల‌తో ఝ‌డిపిద్దాం అనుకొనే సినిమాల‌కంటే గీతాంజ‌లి వెయ్యి రెట్లు మేలు.

ఫ‌స్టాఫ్ లో హార‌ర్‌, కామెడీల‌లో కామెడీదే పైచేయి. దెయ్యం సీన్స్‌ని కూడా న‌వ్వించాల‌న్న థ్యేయంతో తీసిన‌ట్టు అనిపిస్తుంది. ఆత్రేయ‌, ఆరుద్ర (స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌)ల‌తో చేసిన సీన్లు.. వినోదం పండించాయి. సినిమా కోసం శ్రీ‌ను చేసిన ప్ర‌య‌త్నాలు, ర‌మేష్ రావ్ బాడీలాంగ్వేజ్‌, అత‌ని వింత ప్ర‌వ‌ర్త‌న వినోదం కోస‌మే. ఫ‌స్టాఫ్ అంతా స‌ర‌దా స‌ర‌దా షాక్‌ల‌తో సాగిపోతోంది. కోన వెంక‌ట్ రాసుకొన్న సంభాష‌ణ‌లు, స‌న్నివేశాన్ని న‌డిపించిన విధానం.. విసుగు లేకుండా క‌థ‌ని న‌డిపేశాయి. సెకండాఫ్‌లో క‌థ మొద‌ల‌వుతుంది. అక్క‌డ కాస్త సాగ‌దీసిన‌ట్టు అనిపిస్తుంది. క‌థ మెల్లిగా ఓం శాంతి ఓం (హిందీ) పోక‌డ‌ల్లోకి వెళ్లిపోతుంది. అక్క‌డ బ్ర‌హ్మానందం చేసిన జిమ్మిక్కులు మ‌ళ్లీ క‌థ‌ని ట్రాక్ పైకి తీసుకొస్తాయి. చివ‌ర్లో య‌ధావిధిగా చెడుపై మంచి గెలిచిన తీరు చూపించి శుభం కార్డ్ వేసేశారు. సినిమాలో కొన్ని ట్విస్టుల‌ను ముందే ఊహించొచ్చు. కాక‌పోతే.. వాటిని వినోదాత్మ‌కంగా తీర్చిదిద్దిన విధానం ఆక‌ట్టుకొంటుంది. అందుకే ట్విస్టుల‌ను రివీల్ చేసిన‌ప్పుడు థ్రిల్లింగ్ గా అనిపించ‌క‌పోయినా… ఆస్వాదించేయ‌డానికి ఆస్కారం ద‌క్కింది.

శ్రీ‌నివాస‌రెడ్డి ని మెయిన్ లీడ్ గా తీసుకొని ఓ సినిమాని న‌డిపించ‌డానికి తెగించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని అభినందించాలి. ఆ పాత్ర‌కు శ్రీ‌నివాస‌రెడ్డి ఎంత వ‌ర‌కూ న్యాయం చేశాడ‌న్న సంగ‌తి ప‌క్క‌న పెడితే.. అదో మంచి ప్ర‌య‌త్నం. ఈ పాత్ర‌కీ ఓ సెకండ్ గ్రేడ్ హీరోని తీసుకొంటే.. క‌థ పక్క‌దారి ప‌డుదును. శ్రీ‌నివాస‌రెడ్డి కామెడీ టైమింగ్ ఈ సినిమాకి కలిసొచ్చింది. ఇక అంజ‌లి అద్భుతం అనిపించ‌లేదు గానీ, బాగానే చేసింది. ఒళ్లు కాస్త త‌గ్గించుకొంటే మంచిది. కీల‌క‌మైన ఎమోష‌న్స్ పండించే స‌మ‌యంలో ఆమె న‌ట‌న తేలిపోయింది. మిగిలిన చోట‌.. ఓకే. స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్ బాగానే న‌వ్వించారు. రావు ర‌మేష్‌కి మ‌రోసారి మంచి పాత్ర ద‌క్కింది. రెండు మూడు షేడ్స్ ఉన్న పాత్రని అవ‌లీల‌గా చేసేశాడు. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాణెది చిన్న పాత్రే.

ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ని న‌డిపించిన విధానం బాగుంది. దానికి కోన వెంక‌ట్ పెన్ ప‌వ‌ర్ స‌హ‌క‌రించింది. మాట‌లు బాగానే పేలాయి. సెకండాఫ్‌లో కొన్ని సిల్లీ సీన్స్ ఉన్నాయి. వాటిని ఎడిట‌ర్ గుర్తిస్తే బాగుణ్ణు.ఇలాంటి సినిమాల విష‌యంలో లాజిక్ గురించి మాట్లాడుకోక పోవ‌డ‌మే మంచిది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. చిన్న సినిమా అయినా సాధ్య‌మైనంత రిచ్‌గా తీశారు. ఆర్‌.ఆర్ ఓకే. కాఫీ పాట‌, దాన్ని చిత్రీక‌రించిన విధానం బాగున్నాయి. ఓం శాంతి ఓం క‌థ కూడా ఇలాంటిదే క‌దా, అన్న స్పృహ ద‌ర్శ‌క నిర్మాత‌, క‌థ‌కుల‌కు ఎందుకు రాలేదో. ఒక వేళ వ‌చ్చినా… కొత్త క‌ల‌రింగ్ ఇస్తున్నాం క‌దా, అని స‌ర్దిచెప్పుకొని ఉంటారు.

మొత్తానికి న‌వ్విస్తూ, షాక్‌కి గురిచేసిన సినిమా ఇది. ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సినంత కాల‌క్షేపం దొరికేస్తుంది. ఈ వీకెండ్‌లో మంచి టైమ్‌పాస్ సినిమా కావాలంటే…. గీతాంజ‌లి చూడాల్సిందే. క‌మ‌ర్షియ‌ల్ గానూ వ‌ర్క‌వుట్ అయిపోయే ల‌క్ష‌ణాలున్న సినిమా ఇది.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.25/5                – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

                              |Click here for English Review|

Exit mobile version