Site icon TeluguMirchi.com

రివ్యూ: చండీ

chandi

చెత్తకుండీ..  ‘చండీ’ : తెలుగు మిర్చి రేటింగ్స్ : 1.5/5

ఎడిటింగ్ రూమ్‌ లో వేస్ట్ వేసుకొనే డ‌బ్బా ఒక‌టుంటుంది. `ఈ సీన్ ఎవ‌రూ చూడ‌లేరు బాబోయ్‌` అనుకొన్నవ‌న్నీ.. డిలీట్ అయిపోయి ఆ డ‌స్ట్ బిన్‌ లోకి వ‌చ్చేస్తుంటాయ్‌. అలా వ‌చ్చిన స‌న్నివేశాలన్నీ ఏరి కూర్చి.. ఇంకో సినిమా తీస్తే అది చండీలా ఉంటుందేమో..? సినిమా ఇలా తీయ‌కూడ‌దు బ్రద‌ర్‌.. అని భ‌విష్యత్త్ త‌రాల‌కు పాఠంగా చెప్పడానికి స‌ముద్ర ఓ సినిమా తీశాడేమో అనిపిస్తుంది… చండీ చూస్తే!! క‌థ‌, క‌థ‌నం బాలేని ఓ సినిమాని 24 విభాగాలూ క‌ల‌సి చీల్చి చెండాడితే ఎలా ఉంటుందో ‘చండీ’ సినిమా చూస్తే తెలుస్తుంది. ఇంత ఉపోద్ఘాతం ఇచ్చిన త‌ర‌వాత అస‌లు ఈ చండీలో ఏముందో తెలుసుకోవాల‌న్న కోరిక పుడితే… జంప్ ఇంటూ ద స్టోరీ

చండీ (ప్రియ‌మ‌ణి) కి ధైర్యం, దూకుడు ఎక్కువ‌. విలు విద్యలో ఆరితేరిపోయింది. హైద‌రాబాద్‌ లో ఉంటూ… ఇక్కడ కొన్ని హ‌త్యలు చేస్తుంటుంది. దానికి శేఖర్ ఆజాద్ (శరత్ కుమార్) స‌హాయం చేస్తుంటాడు. ఈ హ‌త్యలు ఎవ‌రు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే విష‌యం పోలీసుకులకు సైతం అర్థం కాదు. దాంతో ప్రభుత్వం సిబిఐ ని రంగంలోకి దింపుతుంది. అద‌నే శ్రీమన్నారాయణ (నాగబాబు). శ్రీ‌మ‌న్నారాయ‌ణ ఎన్ని ప్రయ‌త్నాలు చేసినా చండీ దొర‌కదు. త‌న శత్రువులు ఒకొక్కరినీ మ‌ట్టుపెడుతూ ఉంటుంది. బంగార్రాజు (సుప్రీత్) అనే కిరార‌త‌కుడిని చంపేస్తుంది. అత‌ను మంత్రి కొడుకు. దాంతో చండీ కోసం సీబీఐ త‌న వేట మ‌రింత ఉధృతం చేస్తుంది. ఈ ప్రయాణంలో శ్రీ‌మ‌న్నారాయ‌ణ‌కు చండీ గురించిన కొన్ని నిజాలు తెలుస్తాయి. అస‌లింత‌కీ చండీ ఎవ‌రు? ఈ హత్యలు ఎందుకు చేస్తుంది ? అశోక్ గ‌జ‌ప‌తిరాజు (కృష్ణంరాజు)కీ చండీకి ఉన్న సంబంధం ఏమిటి? అనేదే చండీ క‌థ‌.

అతిసాదా సీదా క‌థ‌ను మ‌రింత నాసిర‌కంగా తీశాడు. అస‌లు ఇలాంటి క‌థ‌ల్ని నిర్మాత‌లు ఎలా ఒప్పేసుకొంటార‌బ్బా అనిపిస్తుంది. దానికి తోడు న‌టీన‌టుల భ‌యంక‌ర‌మైన ఓవ‌రాక్షన్. స‌ముద్ర అలా చేయించుకొన్నాడో, లేదంటే… అంద‌రూ పోటీ ప‌డి అతి చేశారో తెలీదు గానీ, తెర‌పై క‌నిపించిన ప్రతీ న‌టుడూ అతికి అర్థం చెప్పే స్థాయిలో న‌టించారు. దాన్ని త‌ట్టుకోవ‌డం మాన‌వ మాత్రుడి వ‌ల్ల కాదు. స‌ముద్ర ఈ క‌థ‌ను ఏ మ‌హేష్ బాబు కోస‌మో, ఎన్టీఆర్ కోస‌మో రాసుకొంటున్నా… అనుకొన్నట్టు హీరోయిజం ఎలివేట్ చేసిన డైలాగులు భ‌యంక‌రంగా రాసుకొన్నాడు. ఆ డైలాగుల‌న్నీ ప్రియ‌మ‌ణి ప‌లుకుతుంటే… అమ్మబాబోయ్‌.. ఎగ్జిట్ ఎటు అంటూ వెతుక్కోవ‌ల‌సిందే. నా ఫిగ‌రును చూడు .. నా పొగ‌రును చూడాల‌నుకోకు – అంటూ అత‌డు డైలాగుల‌ను మ‌రోలా వినిపించే ప్రయ‌త్నం చేశారు. ప్రతీ డైలాగులోనూ ప్రాస‌… సీనంతా న‌స‌.

గ్లామ‌ర్ పాత్రలు రాక అవ‌స్థలు ప‌డుతున్న ప్రియ‌మణి సాధ్యం, క్షేత్రం లాంటి సినిమాల‌తో లేడీ ఓరియెంటెడ్ పాత్రల వైపు మ‌ళ్లింది. ఆ రెండు సినిమాలూ స‌రైన ఫ‌లితం ఇవ్వలేదు. దుర‌దృష్టవ‌శాత్తూ చండీ కూడా ఆమెకు నిరాశ‌నే మిగిల్చింది. ప్రియ‌మ‌ణి మంచి న‌టే. ఆమె ఖాతాలో జాతీయ అవార్డు కూడా ఉంది. అలాంటి న‌టి సాదాసీదాగా క‌నిపించిందంటే అది ఎవ‌రి త‌ప్పు..? ప్రియ‌మ‌ణి త‌ర‌వాత చెప్పుకోద‌గిన లెంగ్తీ పాత్ర‌… కృష్ణంరాజు. ఆయ‌న పాత్రని రెబ‌ల్ స్టార్ రేంజులో చూపిద్దాం అనుకొన్నాడు ద‌ర్శకుడు. కృష్ఱంరాజు వ‌య‌సైపోయింద‌ని, ఆయ‌న ఇలాంటి పాత్రల నుంచి రిటైర్ మెంట్ తీసుకోవాల‌ని ఈ సినిమా చూస్తే అర్థమ‌వుతుంది. శ‌ర‌త్ బాబు, నాగ‌బాబు, పోసాని – ఇలా ఒక్క పాత్రని కూడా గుర్తించుకొనేలా మ‌ల‌చ‌లేక‌పోయాడు ద‌ర్శకుడు. చండీ అని పేరు పెట్టి క‌థానాయిక పాత్రనే స‌రిగ్గా డిజైన్ చేయ‌లేక‌పోతే మిగిలిన పాత్రలు బాగున్నా, లేకున్నా ఎవ‌రికి కావాలి?

సినిమాలో ప్రతీ స‌న్నివేశానికీ లాజిక్ లేక‌పోయినా ఫ‌ర్లేదు. కానీ క‌నీసం కొన్ని సీన్లకైనా ఉండాలి క‌దా..? ఈ సినిమాలో లాజిక్ ప్రతీ చోటా మిస్ అయ్యింది. 24 విభాగాల్లో ఏ ఒక్క విభాగాన్నీ స‌మ‌ర్థంగా ముందుకు న‌డిపించ‌లేక‌.. తన ప‌ని తాను చేయ‌లేక చండీని ఎవ్వరికీ అర్థం కాని రేంజులో త‌యారు చేసిన ద‌ర్శకుడే ఈ సినిమా ప‌లితానికి బాధ్యత వ‌హించాలి. స‌ముద్ర కి ఆవేశం ఎక్కువ‌. ప్రతీ సీన్ భారీ స్థాయిలో తీయాల‌నుకొంటాడు. ప్రతీ పాత్రనీ అంతే భారీగా ఎలివేట్ చేయాల‌నుకొంటాడు. కానీ చేయ‌లేదు. అత‌ను రాసుకొన్న క‌థ‌లో ద‌మ్ము లేన‌ప్పుడు ఎవ‌రితో ఏం చేయించినా ఏం లాభం?? ద‌ర్శకుడిగా త‌న మైన‌స్ ల‌న్నీ ఈ సినిమాలో మ‌రోసారి బ‌య‌ట ప‌డ్డాయి. ఒక్క స‌న్నివేశాన్ని కూడా స‌రిగా రాసుకోలేక‌పోయాడు. సినిమాలో ఉన్న ట్విస్ట్‌ ల‌ను ప్రేక్షకుడు ముందే ఊహిస్తాడు. అలా స్ర్కీన్ ప్లే ర‌చ‌యిత‌గా ఆయ‌న విప‌ల‌మ‌య్యాడు. అస‌లు ఇంత రొటీన్ రివైంజ్ డ్రామాని ప్రియ‌మ‌ణిపై తీయాల‌ని ఎందుకు అనిపించిందో..? క‌థ‌కు బ‌లం అని అనుకొన్న ఫ్లాష్ బ్యాక్ స‌న్నివేశాల‌ను కూడా ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకొనేట‌ట్టు తీయాలేక‌పోయాడు. ఎంత సేపూ బిల్డప్ షాట్స్ పైనే దృష్టి పెట్టాడు. ’గ‌బ్బర్ సింగ్’ ఫీవ‌ర్ నుంచి మ‌న‌వాళ్లు ఇంకా బ‌య‌ట ప‌డ‌డం లేదు. అంత్యాక్షరి స‌న్నివేశాన్ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాడుకొంటున్నారు. ఈ సినిమాలోనూ ఆ పైత్యం ఉంది. ఇక మీద‌ట టీవీలో గ‌బ్బర్ సింగ్‌ లోని అంత్యాక్షరి సీన్ వ‌చ్చినా.. చూడ్డానికి భ‌య‌ప‌డే రేంజులో ఉందా స‌న్నివేశం. సినిమాకి ప్రధానంగా కావ‌ల్సింది వినోదం అన్న సంగ‌తి మ‌ర్చిపోయాడు ద‌ర్శకుడు. ఏదో ఓ సీరియ‌స్ క్రైం డ్రామా తీయాల‌న్న ఉద్దేశంతో…. త‌న‌కు తోచింది తీసి పాడేశాడు.

పాట‌ల గురించి కూడా మాట్లాడుకోవ‌డానికి ఏమీ లేదు. పాట‌ల్లో సాహిత్యం, స్వరాలూ అన్నీ తీసిక‌ట్టుగానే ఉన్నాయి. దానికి తోడు వాటిని ప్లేస్ చేసిన విధానం కూడా స‌రిగా లేదు. సినిమా అన్నాక మాస్ కోసం కొన్ని పాట‌లు ఉండాలి కాబ‌ట్టి తీశారు. త‌మ‌కు ఇష్టం ఉన్నచోట వాటిని అతికించేశారు. ఇక చిన్నా అందించిన నేప‌థ్య సంగీతం కూడా దారుణంగా ఉంది. స‌న్నివేశంలో బ‌లమే లేన‌ప్పుడు నేప‌థ్య సంగీతం తో ఎలివేట్ చేద్దామంటే ఎలా కుదురుతుంది.? త‌న డ్రమ్ముల‌కు ప‌ట్టిన దుమ్మును ఈ విధంగా దులుపుకొన్నాడు చిన్నా.

ఈమ‌ధ్య కాలంలో వ‌చ్చిన మ‌రో సాదా సీదా చిత్రమిది. స‌ముద్ర పై ఎవ‌రికీ న‌మ్మకాల్లేవు. ఏమైనా అద్భుతాలు సృష్టిస్తాడేమో అన్న ఆశా లేదు. కాబ‌ట్టి చండీ గురించి పెద్దగా ఆశ‌లు పెట్టుకోలేదు. దాంతో ఈసినిమా చూస్తే ఎవ‌రూ ప్రత్యేకంగా డిజ‌ప్పాయింట్ అవ్వాల్సిందేం లేదు. ఓ అతి సాధార‌ణ‌మైన క‌థ‌ని ఇంకాస్త అద్వాన్నంగా తీస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి తీసిన సినిమాలా ఉంది… చండీ.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 1.5/5                                   -స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

 

 

Exit mobile version