రివ్యూ : ఛలో..కామెడీ చూసేద్దాం…

టైటిల్ : ఛలో (2018)
స్టార్ కాస్ట్ :నాగ శౌర్య , రేష్మిక తదితరులు…
దర్శకత్వం : వెంకి కుడుముల‌
నిర్మాతలు: ఉషా ముల్పూరి
మ్యూజిక్ : మహతి స్వర సాగర్
విడుదల తేది : ఫిబ్రవరి 02, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

రివ్యూ : ఛలో.. కామెడీ చూసేద్దాం…

“ఊహ‌లు గుస‌గుస‌లాడే”, “దిక్కులు చూడ‌కు రామ‌య్య‌”, “ల‌క్ష్మిరావే మా ఇంటికి”, “క‌ళ్యాణ‌ వైభోగం”,” జ్యో అచ్యుతానంద” లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో… ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం దక్కించుకున్న నాగ‌శౌర్య, ఏడాది గ్యాప్ తర్వాత ఛలో అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం లో, ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా ఈ మూవీ నిర్మించబడింది. మరి నాగ శౌర్య ఈ మూవీ తో ఎలా అలరించాడో..ఇప్పుడు చూద్దాం.

కథ :

హరి ( నాగశౌర్య) గొడవలంటే భలే సరదా. చిన్నప్పటి నుండి ఎవరితోనైనా గొడవ పడడం, లేదా ఎవరైనా గొడవపడుతుంటే ఆనందపడడం ఇతడికి ఇష్టం..హరి ప్రవర్తన చూసిన తండ్రి (నరేష్) దూరంగా పంపిస్తే గానీ సెట్ అవ్వడాన్ని అతడిని ఆంధ్రా, తమిళనాడు బోర్డర్‌ అయినా తిరుప్పురం పంపిస్తాడు. అప్పటికే ఆ రెండు ఊళ్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే మండేలా కోపాలు ఉంటాయి. ఇలాంటి తరుణంలో హరి అక్కడ చదువుకోవడానికి వెళ్తాడు.

హరి ని చూసిన వారు తమిళ వ్యక్తి అనుకొని తమిళ బ్యాచ్‌ లో కలుపుకుంటారు. అక్కడే కార్తీక(రష్మిక)ను చూసి ఇష్టపడతాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆమె వెంటపడుతుంటాడు. హరి లో ఉన్న లక్షణాలే , కార్తీక లో ఉండడం తో ఇద్దరు త్వరగానే దగ్గరవుతారు. కార్తీక తమిళ అమ్మాయి కావడం తో ముందుగా వారి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు హరి. కానీ తెలుగు అబ్బాయి కి అమ్మాయిని ఇవ్వడం అంటే ఒప్పుకోరని , ముందుగా రెండు ఊళ్లను కలపాలని హరి నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? హరి అనుకున్నట్లు ఆ రెండు ఊళ్లు కలిసాయా..? లేదా..? అనేది తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* మ్యూజిక్

* హీరో – హీరోయిన్ లవ్ ట్రాక్

* కామెడీ

మైనస్ :

* క్లైమాక్స్

* కథ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* హరి పాత్రలో నాగ శౌర్య చాల తేలికగా నటించాడు..గొడవలంటే ఇష్ట పడడం , ఎవరితోనైనా గొడవకు దిగడం వంటివి చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ తో లవ్ సీన్లలో యూత్ కు బాగా నచ్చుతాడు. ఈ చిత్రం తర్వాత అమ్మాయిల రాకుమారుడు అవ్వడం ఖాయం.

* ఈ చిత్రం తో తెలుగు లో పరిచయమైన రష్మిక అందంగా కనిపించడమే కాదు , నటన తో మంచి మార్కులు కొట్టేసింది. నాగ శౌర్య , రష్మిక మధ్య వచ్చే సన్నివేశాలు యూత్ కు బాగా నచ్చుతాయి. వీరిద్దరూ కూడా పోటీ పడి నటించారు.

* నాగ శౌర్య తండ్రి గా నరేష్ పాత్ర పర్వాలేదు అనిపించింది. రఘు బాబు, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ అంత కూడా వెన్నెల కామెడీ తో సాగిపోయింది.

* పోసాని, మైమ్ గోపి, ప్రవీణ్, సత్య, వైవా హర్ష, వేణు గోపాల రావు, మెట్ట రాజేంద్రన్, ప్రగతి, స్వప్ని, సుదర్శన్, జీవా తదితరులు వారి వారి పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* ముందుగా మ్యూజిక్ గురించి చెప్పాలి..మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ మూవీ తో మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈయన మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. సినిమా రిలీజ్ కు ముందే ఆడియో సూపర్ హిట్ కావడం తో పాజిటివ్ టాక్ తో సినిమా విడుదల అయ్యింది. నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ఈ మధ్య వచ్చిన చిత్రాల్లో ఎక్కువ గా ఆడియో పరంగా ఆకట్టుకున్న సాంగ్స్ ఇవే అని చెప్పాలి.

* ఎడిటింగ్ సైతం ఎక్కడ కూడా ప్రేక్షకులకు చిరాకు తెప్పించకుండా నడిచింది.

* సాయి శ్రీరామ్‌ సినిమా ఫోటోగ్రఫి సినిమా హైలైట్స్ లలో నిలిచింది. పల్లె అందాలతో పాటు హీరో , హీరోయిన్ లను చాల అందంగా చూపించాడు.

* ఉషా ముల్పూరి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ చిత్రం వారికీ మొదటి చిత్రమే అయినప్పటికీ ఎక్కడ కూడా ఖర్చు కు వెనకడుగు వెయ్యకుండా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు.

* ఇక డైరెక్టర్ వెంకి కుడుముల‌ విషయానికి వస్తే..తనకు మొదటి చిత్రమే అయినాగానీ ఎక్కడ కూడా ఖంగారుపడకుండా తెరకెక్కించాడు. కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ , ఎక్కడ కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా నడిపించాడు. ఫస్ట్ హాఫ్ అంత కామెడీ తో , సెకండ్ హాఫ్ హీరో అనుకున్నది సాధించడం అనేది చూపించాడు.. ఓవరాల్ గా వెంకీ తాను అనుకున్నది అనుకున్నట్లు తెర ఫై చూపించి సక్సెస్ అయ్యాడు.

చివరిగా :

కథ పరంగా చూస్తే కొత్తదనం లేకపోయినప్పటికీ , తన ప్రేమ కోసం హీరో రెండు ఊళ్లను ఎలా కలిపాడు..తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేది కథ. మ్యూజిక్ , సినిమా ఫొటోగ్రఫీ , హీరో , హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ ఇవన్నీ సినిమాకు ప్రాణం పోశాయి. నాగ శౌర్య ఏడాది గ్యాప్ తర్వాత ఛలో అంటూ వచ్చి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హీరోయిన్ రష్మీకి సైతం ఈ మూవీ తర్వాత తెలుగు అవకాశాలు పెరగడం ఖాయం. మొత్తం మీద ఛలో..కామెడీ తో సాగిపోయే రెండు ఊళ్ల ప్రేమ కథ.