తారాగణం: కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, పృథ్వీ, సోహైల్ ఖాన్
దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: ఎన్టీఆర్ ఆర్ట్స్, సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్ప
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
వైజయంతీ (విజయశాంతి) ఓ పవర్ఫుల్, సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆమె కుమారుడు అర్జున్ (కల్యాణ్ రామ్) తల్లిని అంతులేని ప్రేమతో చూసే వ్యక్తి. తల్లి కలను నిజం చేయాలన్న తపనతో, తాను కూడా ఐపీఎస్ అధికారి అవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాడు. అయితే కొన్ని కారణాల వల్ల అర్జున్ గ్యాంగ్‌స్టర్‌గా మారాల్సి వస్తుంది. విశాఖపట్నంలో అర్జున్ చుట్టూ ఒక రాజ్యం నిర్మించుకుని, తనదైన శైలిలో న్యాయం చేయడం ప్రారంభిస్తాడు. ప్రజలలో భయం కాకుండా, నమ్మకం తెచ్చిన అతని వ్యవస్థకు దండం పెట్టేవాళ్లు కూడా ఉంటారు. ఇదిలా ఉండగా, ముంబై నుంచి వచ్చిన గ్యాంగ్‌స్టర్ పఠాన్ (సోహైల్ ఖాన్) – వైజయంతీపై పగతో విశాఖపట్నం లో అడుగుపెడతాడు. తల్లి ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న సమయంలో, తానే నేరస్థుడిగా తల్లి నుండి దూరమైన అర్జున్ – తన తల్లిని కాపాడగలిగాడా? తల్లి తన కుమారుడిపై తిరిగి గర్వపడే రోజు వచ్చిందా? అర్జున్ ఎందుకు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు? పోలీసు కుటుంబంలో పుట్టిన వాడి జీవితం నేరదారిలోకి ఎందుకు మళ్లింది? తెలవాలంటే బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే..
‘అర్జున్’ చిత్రం ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్‌ను మరింత బలపర్చే ఉద్దేశంతో దర్శకుడు కథను మలిచారు. వైజయంతి (విజయశాంతి) అనే నిజాయితీగల పోలీస్ అధికారిణి కుమారుడిగా అర్జున్ (కళ్యాణ్ రామ్) కథ ప్రారంభమవుతుంది. తల్లిని ఆదర్శంగా చూసే కొడుకు అనుకోని పరిస్థితుల్లో గ్యాంగ్‌స్టర్‌గా మారాల్సి వస్తాడు. తల్లి, కొడుకు మధ్య ఉన్న విభేదాలు, ఎమోషనల్ కోణంలో కథ సాగుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్లను బలంగా ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే సెకండ్ హాఫ్‌లో కథ కొంత నెమ్మదిగా, కొంచెం సాగతీతగా అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం అసలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. షాక్ ఫ్యాక్టర్‌తో కూడిన ముగింపు తల్లి-కొడుకు మధ్య బంధాన్ని భావోద్వేగంగా చూపించి ప్రేక్షకులను కనెక్ట్ చేసేలా ఉంటుంది.
నటన పరంగా కళ్యాణ్ రామ్ తన యాక్షన్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించగా, విజయశాంతి పాత్ర కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. ఆమెకు డిజైన్ చేసిన కొన్ని యాక్షన్ సీన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హీరోయిన్ పాత్ర కేవలం పాతలకోసమే పెట్టినట్లు అనిపిస్తుంది. పృథ్వి బబ్లూ, శ్రీకాంత్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు., టెక్నికల్ టీమ్ పరంగా చూసినప్పుడు, సినిమాటోగ్రఫీ మంచి పనితనం చూపించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల బాగానే వర్కౌట్ అయింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో మ్యూజిక్ సినిమాకు బలం చేకూర్చింది. పాటలు పెద్దగా గుర్తుండిపోకపోయినా, నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే సెకండ్ హాఫ్‌లో ఎడిటింగ్ ఇంకా కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద, క్లిష్టమైన లాజిక్స్‌ను పక్కనబెట్టితే, ‘అర్జున్’ ఒక పక్కా మాస్ యాక్షన్ డ్రామాగా చెప్పొచ్చు.
ఫైనల్ గా అర్జున్ S/o వైజయంతి ఎమోషనల్ రొటీన్ కమర్షియల్ యాక్షన్ డ్రామా…
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5