నటీనటులు: నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు;
సంగీతం: రధన్;
ఛాయాగ్రహణం: సిద్ధం మనోహర్;
ఎడిటింగ్: అభినవ్ దండా;
నిర్మాత: నాగ్ అశ్విన్;
దర్శకత్వం: కె.వి. అనుదీప్
నిర్మాణ సంస్థ: స‌్వప్న సినిమా
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5
అతి సింపుల్ గా కనిపించే అతి కష్టమైన సబ్జెక్ట్ కామెడీ. జోక్ పేలితే ఈజీగా నవ్వు పుడుతుంది. కానీ జోక్ పేలడం అంత జోక్ కాదు. ప్రేక్షకుడి నవ్వించడం అంత తేలికకాదు. కానీ నవ్వించే సినిమాకి మాత్రం మన ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు. ఇలా నవ్వించాడానికి టాలీవుడ్ లో మరో సినిమా రెడీ అయ్యింది. అదే జాతి రత్నాలు. మహశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రివ్యూ ఒకసారి చూద్దాం.
కధ: శ్రీకాంత్ (నవీన్ పొలిశెట్టి), శేఖర్ (ప్రియదర్శి), రవి (రాహుల్ రామకృష్ణ) చిన్నప్పటి నుంచీ మంచి దోస్తులు. తమని తాము తెలివైన వాళ్లమని భావించుకునే చిలిపి కుర్రాలు. జోగిపేటలో అల్లరి చిల్లరగా తిరుగుతూ జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటారు. లైఫ్‌లో స్థిరపడాలనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్లతో ఛాలెంజ్ చేసి జోగిపేట నుంచి హైదరాబాద్‌కి వస్తారు. కానీ, ఇక్కడికి వచ్చాక అనుకోని పరిస్థితుల్లో వాళ్ల జీవితాలు పెద్ద సమస్యలో చిక్కుకుంటాయి. స్థానిక ఎమ్మెల్యే చాణక్య (మురళీ శర్మ)పై జరిగిన హత్యాయత్నం కేసులో ఈ ముగ్గురు అన్యాయంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మరి ఆ మర్డర్ కేసులో ఈ ముగ్గురిని ఇరికించిందెవరు? ఈ కేసు నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? అనేది వెండితెరపై చూడాలి.
నవ్వుకి లాజిక్కులు అవసరం లేదు. జస్ట్ మ్యాజిక్ జరిగిపోతే చాలు. తెరపై సన్నివేశం చూసి. జనాలు నవ్వుకుంటారా? లేదా? అనేది ఆలోచిస్తే చాలు. ఇంకేం అక్కర్లెద్దు. `జాతిరత్నాలు` అలానే పుట్టిన కథ అనిపిస్తుంది. ముగ్గురు ఆవారా గాళ్లు – వాళ్లు చేసిన తెలివి తక్కువ పనులు – దాన్నుంచి వచ్చిన తిప్పలు – అందులోంచి పుట్టిన నవ్వులు వెరసి – జాతి రత్నాలు.దర్శకుడు.. చాలా లైటర్ వేలో రాసుకున్న కథ ఇది. ఎంత లైటర్ గా ఉందంటే. సీరియస్‌గా సాగాల్సిన కోర్టు రూమ్ లో కూడా కామెడీ పండించాలనుకున్నంత. ప్రతీ సీనూ అలానే సాగుతుంది. జోగిపేటలో జాతిరత్నాల అల్లరి దగ్గర్నుంచి కథ మొదలవుతుంది. ఆయా సన్నివేశాలన్నీ హాయిగా సాగిపోతాయి.
హైదరాబాద్ వచ్చి..ఓ గేటెడ్ కమ్యునిటీలోని అపార్ట్మెంట్లో సెటిల్ అవ్వడం, అక్కడ చిట్టితో ప్రేమాయణం నడపడం.. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కామెడీగా సాగిపోతాయి. ఎమ్మెల్యే పై హత్యాయత్నం కేసులో ఇరుక్కోవడంతో ఇంట్రవల్ పడుతుంది. అక్కడి నుంచి కథ క్రైమ్ జోనర్‌లోకి వెళ్తుందేమో అనుకుంటారంతా. కానీ.. ఆ క్రైమ్ ని కూడా కామెడీ చేసేశారు. కొన్ని చోట్ల.. అది వర్కవుట్ అయ్యింది. ఇంకొన్ని మిస్ ఫైర్ అయ్యింది. ద్వితీయార్థంలో దర్శకుడు లాజిక్ అనే జోలికే పోలేదు. ఏ సీన్ లోనూ లాజిక్ ఉండదు. తొలి భాగంతో పోలిస్తే.. ద్వితీయార్థంలో కామెడీ డోసు బాగా తగ్గిపోయింది. క్లైమాక్స్ కూడా సోసోగానే వుంది.
ఎవరెలా చేశారు : పల్లెటూరి కుర్రాడిగా జోగిపేట శ్రీకాంత్ పాత్రలో నవీన్ అద్భుతంగా ఒదిగిపోయాడు. బలంగా లేని చాలా సన్నివేశాల్ని సైతం తన కామెడీ టైమింగ్‌తో ఎంతో చక్కగా నిలబెట్టాడు. ఇక శేఖర్, రవి పాత్రల్లో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమదైన శైలిలో నటించారు. చిట్టి పాత్రలో ఫరియా అబ్దుల్లా అందం.. అభినయాలతో ఆకట్టుకుంటుంది. మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, నరేష్ పరిధి మేర చేశారు. మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఓకే.
ప్లస్ పాయింట్స్ :
వినోదాత్మక కథ, ప్రథమార్ధం
నవీన్ నటన, కామెడీ టైమింగ్
మైనస్ పాయింట్స్
లాజిక్కులకు దూరంగా ద్వితీయార్ధం
క్లైమాక్స్
చివరిగా .. ‘జాతి రత్నాలు’ .. కామెడీ రత్నాలు