రాష్ట్రవ్యాప్తంగా వైస్ఆర్ పెన్షన్ కానుకను మే నెల ఒకటోతేదీన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఒకవైపు కరోనా నిబంధనలను పాటిస్తూనే, మరోవైపు లక్షలాధి మంది పెన్షనర్ల చేతికే ఒకటో తేదీన పెన్షన్ సొమ్మును అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్దం చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 2,37,615 మంది వాలంటీర్లతో పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
వైఎస్‌ఆర్ పెన్షన్ పంపిణీ కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.1421.20 కోట్లను విడుదల చేసింది. లబ్దిదారులకు బయోమెట్రిక్‌కు బదులు పెన్షనర్ల ఫోటోల జియో ట్యాగింగ్‌ను అమలు చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి పోర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందజేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతో పాటు గుర్తింపు పొందిన వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా నెల ఒకటో తేదీనే పెన్షన్ సొమ్ము అందిస్తామని… ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్ఐవి, డయాలసిస్ పెషంట్లకు డిబిటి విధానంలో పెన్షన్ సొమ్మును జమ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.