జగన్‌ రాజీనామా అస్త్రం పని చేసేనా?

ys jaganవైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ తమ పార్టీ ఎంపీలతో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయించేందుకు కూడా సిద్దం అంటూ ప్రకటించాడు. ఏపీకి కేంద్రం ఇస్తానంటూ ప్రకటించిన ప్రత్యేక హోదాను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే అంటూ ఆయన డిమాండ్‌ చేశాడు. బడ్జెట్‌ సమావేశాల వరకు ఎదురు చూస్తామని, ఆతర్వాత నుండి ఉద్యమ బాట పడతాం అంటూ జగన్‌ ప్రకటించాడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో ఇలా అదే బీజేపీపై పోరాటంకు సిద్దం అవ్వడం వెనుక ఉన్న రాజకీయం ఏంటా అని ప్రస్తుతం విశ్లేషకులు కూడా జుట్టు పీక్కుంటున్నారు.

జగన్‌ తన పార్టీ ఎంపీలను రాజీనామా చేయించినంత మాత్రాన కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందనే నమ్మకం లేదు. అయినా కూడా ప్రజల్లో మైలేజ్‌ కోసం, పార్టీకి పేరు కోసం బీజేపీ వద్ద తమ సత్తా చాటేందుకు జగన్‌ ఇలా చేస్తూ ఉండవచ్చు అని భావిస్తున్నారు. మొత్తానికి జగన్‌ రాజీనామా అస్త్రం ఎలా పని చేయబోతుందా అని అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే జగన్‌ చేసిన ప్రకటన టీడీపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తే ఖచ్చితంగా టీడీపీ నాయకులపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడిని ఎలా అధిగమించాలి అనే విషయమై అధికార పార్టీలో చర్చ జరుగుతుంది.