జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మీడియా ముందుకు వచ్చి వచ్చే అక్టోబర్ నుండి పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తాను అంటూ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. గత రెండు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఇదిగో అదిగో అంటూ పార్టీ నిర్మాణంను పక్కకు పెడుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు అక్టోబర్ నుండి పార్టీ నిర్మాణంను చేపడదాం అంటూ పవన్ ప్రకటించిన నేపథ్యంలో జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఈ సమయంలోనే వైకాపా నాయకులు తీవ్ర ఆగ్రహంతో మండిపోతున్నారు.
తమ అధినేత జగన్ పాద యాత్ర చేస్తాను అంటూ ప్రకటించిన అక్టోబర్ నెలలోనే జగన్ పార్టీ నిర్మాణంకు సన్నాహాలు మొదలు పెడదాం అంటూ ప్రకటించడంను వారు విమర్శిస్తున్నారు. జగన్ ప్రభావంను తగ్గించేందుకు, మా అధినేత పాద యాత్రకు మైలేజ్ రావద్దనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ఇలా పవన్ కళ్యాణ్‌తో ప్రకటన చేయించాడు అంటూ వైకాపా నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు చేతిలో పవన్ ఒక కీలు బొమ్మగా మారి మా అధినేత పాద యాత్రను అడ్డుకునేందుకు చూస్తున్నాడని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా జగన్ పాద యాత్ర చేసి తీరతారు అని, వచ్చే ఎన్నికల్లో బాబు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా కూడా జగన్ సీఎం అవ్వడం ఖాయం అని, పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంకు కూడా నోచుకోకుండా ఉంటుందని వైకాపా నేతలు అంటున్నారు. అయితే కొందరు మాత్రం జగన్ పాదయాత్రకు పవన్ పార్టీ నిర్మాణంకు సంబంధం ఏంటని, వైకాపా నేతల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.