రైతులకి శుభవార్త చెప్పిన జగన్

ఒకపక్క రైతులకి విత్తనాలు అందక ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుండడంతో వారిని మచ్చిక చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే వారిని సంతోష పెట్టేలాగా నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. గత సీజన్ లో పంట వేసి అవి అమ్ముడు కాక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న శనగ రైతులను ఆదుకునేందుకు ఆయన ముందుకు వచ్చారు.

గొడౌన్లు, కోల్డ్ స్టోరేజ్‌‌ లలో నిలవబెట్టిన శనగలను మార్కెట్ రేటుకు అదనంగా క్వింటాలుకు రూ.1500 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా శనగ రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీల వద్ద నున్న శనగ రైతుల జాబితా మేరకు ఈ అదనపు సాయం చెల్లించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అలాగే ప్రతి ఎకరాకు 30 క్వింటాళ్లకు మించకుండా శనగ రైతులకు చెల్లింపులు జరపాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ నిర్ణయంపై శనగ రైతులు హర్షం వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనూ శనగ రైతులు తమ గోడను ఆయనతో వెళ్లబోసుకున్నారు. పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని తమను ఆదుకోవాలని కోరారు. అప్పట్లో వారి సమస్యపై సానుకూలంగా స్పందించిన జగన్వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం వారి సమస్యపై స్పందించిన జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.