ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో జోరుగా సాగుతుంది. ఇటీవలే వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న జగన్ రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. నేడు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో జగన్ పాదయాత్రను నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఓటుకు మూడు వేలు ఇచ్చేందుకు కూడా సిద్దపడతారని, వారు ఇచ్చే డబ్బును తీసుకోవాల్సిందిగా జగన్ సూచించాడు.
వారు పంచిపెట్టే ప్రతి పైసా కూడా మనదే అని, అందకే వారు ఓట్ల కోసం ఇచ్చే డబ్బును తీసుకుని, ఓటు మాత్రం వైకాపాకు వెయ్యాలంటూ సూచించాడు. తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు సీఎం చంద్రబాబు నాయుడు అధికారంను అడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించి, ఆ డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసేందుకు సిద్దం అవుతున్నారు అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2019 ఎన్నికల్లో వైకాపా అధికారం దక్కించుకోవడం ఖాయం అని, తెలుగుదేశం పార్టీకి ప్రజలు గట్టి బుద్ది చెప్పడం కూడా ఖాయం అంటూ జగన్ పేర్కొన్నాడు.