అడ్దుకుంటారా.. ? హారతి పడతారా.. ?

seemandra-leadersసీమాంధ్ర నేతల్లో ’తెలంగాణ బిల్లు’పై అప్పుడే టెన్షన్‌ ప్రారంభమైంది. పైకి అసెంబ్లీకి టీ-బిల్లు వస్తే.. అడ్డుకుంటామని ఆగ్రహంగా చెబుతున్నప్పటికినీ.. లోలోపల మాత్రం అధిష్టానం ఆజ్ఞకి తలవంచేలా కనిపిస్తున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. దీంతో.. ఇటు అసెంబ్లీలోనూ, అటు పార్లమెంట్‌లోనూ తెలంగాణ బిల్లును వ్యతిరేకించడంలో నాయకుల ఐక్యత పైన అనుమానాలు మొదలయ్యాయి. నిన్నమొన్నటి వరకు విభజన జరగదు, మమ్మల్ని కాదని ముందుకెళ్లగలరా… ? అని మాట్లాడిన మంత్రులు కేంద్ర పురంధేశ్వరి, కిల్లి కృపారాణి కాస్త స్వరం మార్చి.. తెలంగాణ ఆగదని తేల్చిచెప్పేస్తున్నారు. పైగా.. ఆగితే సంతోషిస్తామని.. మేము సమైక్యవాదులేమని సేఫ్ గా ఓ ప్రకటన పడేస్తున్నారు. ఇలా.. ఒక్కొక్కరు సమైక్యం నుంచి సపరేట్ కు టర్న్ అవుతున్నారు.

సీమాంధ్ర నేతలు ఎందుకు తమ స్వరాన్ని సమైక్యం నుంచి సపరేట్ కు మారుస్తున్నారు.. ? ఇక్కడే అసలు కథ దాగుంది. వాదం మార్చినవారంతా.. మేడమ్ సోనియా గాంధీతో మంతనాలు జరిపినవారే. అమ్మ ఆజ్ఞతో.. అలవోకగా ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్నారు. అందుకు కిల్లి, కావూరి, పురంధేశ్వరి.. ఇలా ఇంకేందరు వచ్చి చేరుతారో.. ? చెప్పలేము. సరిగ్గా.. ఇదే విషయంపై ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. అధిష్టానం గేమ్‌ ప్లాన్‌తో తమ వ్యూహం బెడసి కొడుతుందేమో అన్న ఆందోళన వారిని పట్టి పీడిస్తోంది. పైగా.. సీమాంధ్ర ప్రాంతం వారిని సంతృప్తి పర్చేలా తెలంగాణ బిల్లును తీసుకువస్తామని జీవోఎం సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తుండటం వీరికి నిద్ర పట్టనివ్వడం లేదు. మరి తెలంగాణ బిల్లును అడ్డుకునేవారెందరో.. ? అధిష్టానం ఆజ్ఞతో టీ-బిల్లుకు హారతి పట్టేవారెందరో త్వరలోనే తేలనుందన్నమాట.. !