Site icon TeluguMirchi.com

ఆంధ్రా మండుతున్నా పవన్‌ మౌనమేనా?

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుంది. ప్రభుత్వం ఎక్కడిక్కడ అణచివేసే ప్రయత్నం చేస్తున్నా కూడా కాపు సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం మాత్రం ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తాజాగా ఆయన పాదయాత్ర నిర్వహించేందుకు సిద్దం అవ్వగా పోలీసులు నిరాకరించారు. ప్రభుత్వ అనుమతి లేకున్నా ముద్రగడ పాదయాత్రకు సిద్దం అవ్వగా పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.

రాష్ట్రంలో ఇంత రచ్చ జరుగుతున్నా ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాత్రం నోరు విప్పలేదు. గతంలో కాపు ఉద్యమంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌ ఈసారి మాత్రం తనకేం సంబంధం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ తీరును కాపు నేతలు మరియు నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వైకాపా మరియు కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.

గతంలో ఎన్నో సార్లు ఎంతో మంది పాదయాత్రలు చేశారు, కాని ప్రభుత్వం ముద్రగడ పాద యాత్రను ఎందుకు అడ్డుకునేందుకు చూస్తుందని రాజకీయ పార్టీల వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పవన్‌ విదేశాల్లో ఉన్న కారణంగా ఈ విషయమై స్పందించడం లేదు అని కొందరు అంటుండగా, కనీసం ట్విట్టర్‌ వేదికగా అయినా ఒక ప్రకటన చేయాల్సిందని కొందరు అంటున్నారు. పార్టీ తరపున ప్రభుత్వ తీరును తప్పుబట్టినా రాజకీయ మైలేజ్‌ వచ్చేదని కొందరు పవన్‌ అభిమానులు భావిస్తున్నారు. పవన్‌ ఇంకా ఎన్ని రోజులు ఈ విషయంపై మౌనంగా ఉంటారో చూడాలి.

Exit mobile version