నెక్ట్స్ సీఎం ఎవరు.. ?

who is the next cmముఖ్యమంత్రి కిరణ్ మార్పుపై కాంగ్రెస్ లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కిరణ్ బాహాటంగానే అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారు. పైగా.. లేఖాస్త్రాలును సంధించి కేంద్రానికి లేని కష్టాలను సృష్టిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. విభజనకు సహకరించని సీఎంను మార్చి అమ్మకు, అధిష్టానికి అత్యంత విధేయుడిగా ఉన్న నేతకు.. ముఖ్యమంత్రి కుర్చీ అప్పగిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ దిశగా ఈ రెండు మూడు రోజుల్లో కీలక మార్పులు, చేర్పులు ఖాయమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యమంత్రిని మార్చితే.. కిరణ్ ప్లేస్ లో వచ్చే కొత్త కిరణ్ ఎవరనే దానిపై ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. అయితే, కొత్త సీఎం అనే ఆలోచన రాగానే రెండు మూడు పేర్లు టక్కున గుర్తొస్తున్నాయి. ఓసారి వారిపై ఓ లుక్కెద్దాం..

ఆది నుంచి అధిష్టానికి అత్యంత విధేయుడుగా వుంటూ.. అమ్మ అనుగ్రహం అంతో.. ఇంతో..  వున్న తెలంగాణ నేత డి.శ్రీనివాస్. పీసీసీ ఛీఫ్ గా వున్న టైమ్ లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారనేది ఈయనకు వున్న ప్రధాన ప్లస్ పాయింట్. అందువల్లనే వరుసగా రెండు సార్లు పీసీసీ పదవిని నిర్వహించారు. ఏమున్న ఎదుట వాగకుండా నింపాదిగా వ్యవహరిస్తారనే టాక్ కూడా వుంది. పైగా.. అమ్మ అనుగ్రహం పుష్కలంగా వుందాయె.. విభజన నిర్ణయం అనంతరం కూడా అమ్మ డిఎస్ నివేదికలకు ప్రాధాన్యత ఇచ్చిందట. ఇక తెలంగాణ ఎప్పుటిలాగే వినిపించే మరికొందరి నేతలు.. జైపాల్ రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వీరిలో కొందరికి అవినీతి రంగు అంటితే.. మరికొందరికి వయోభారం అడ్డువస్తున్నట్లు కనిపిస్తుంది. ఎమైనా.. సోనియా డీఎస్ ను కాదనుకుంటేనే.. వీరు తెరపైకి వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అయితే, డీఎస్ కంటే ముందు.. జైపాల్ రెడ్డిని పరిశీలించే అవకాశాలు పోలేవన్ని విశ్లేషకుల మాట.

తెలంగాణ ప్రాంత నేతలను కాదనుకుంటే అధిష్టానం రాయలసీమ నేతలపైనే దృష్టి సారించే అవకాశం వుంది. కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డితో పాటు ఒకరిద్దరు సీనియర్ మంత్రుల పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల అధిష్టానం నుంచి కోట్లకు కబరు వచ్చిందని.. ఆల్ రెడీ సీఎంగా కోట్ల కన్ ఫామ్ అయ్యారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ప్రచారం ఎలా వున్నా.. ఇప్పుడు అధిషానం ఎంచుకునే అత్యంత విధేయుడు ఎవరనేది ఆసక్తిగా మారింది. ఎన్నికలు కూడా మరో నాలుగైదు నెలల్లోనే వచ్చే అవకాశం వున్న సమయంలో. . ఈ షార్ట్ టైమ్ లో వచ్చే షార్ప్ సీఎంపై రాజకీయ శ్రేణులు దృష్టిసారించారు. సో.. కొత్త సీఎం ఎవరనేది తెలియాలంటే.. ఇంకోవారం వేచి చూడాల్సిందే మరీ..