హరికృష్ణ ఏం చెప్పదలచుకున్నాడు ?

harikarishnaస్వర్గీయ ఎన్ టి ఆర్ తనయుడు, తెలుగుదేశం పార్టీ రాజ్యసభసభ్యుదు నందమూరి హరికృష్ణ తీసుకుంటున్న రాజకీయపరమైన నిర్ణయాలు అటు పార్టీని ఇరకాటంలో పడేయటమే కాకుండా వ్యక్తిగతంగా ఆయన ఆలోచనాధోరణి ని ప్రశ్నించేలా కూడా వున్నాయి. రాష్ట్రవిభజన వివాదం మొదలయింతరువాత మొట్టమొదట రాజీనామా చేసి దానిని ఆమోదింప చేసుకున్న వ్యక్తిగా హరికృష్ణ రికార్డుల్లోకి ఎక్కారు. అయితే తాను సమైక్యాంధ్రకు అనుకూలంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటింఛి తెలుగుదేశం పార్టీని, ప్రత్యేకించి చంద్రబాబునాయుడు ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఎన్నిరకాల వత్తిడులు ఎదురైనా తెలుగుదేశం పార్టీ ప్రత్యెక తెలంగాణా కు కట్టుబడి ఉందంటూ చెబుతున్న చంద్రబాబు కు హరికృష్ణ చర్యలు మింగుడుపడటం లేదు. ఇదే ఆసరాగా కాంగ్రెస్, తెరాస నాయకులు తెలుగుదేశం పార్టీ కి వ్యతిరేకంగా చాకిరేవు పెట్టారు. హరికృష్ణ నిర్ణయం వెనుక చంద్రబాబు వున్నారని, బాబు డైరెక్షన్ లోనే హరికృష్ణ వ్యవహరిస్తున్నారని, బాబు పక్కా సమైక్యవాది అన్న విషయం హరికృష్ణ రాజీనామా తో తేటతెల్లమైందని వారు విరుచుకుపడుతున్నారు. ఒకవేళ హరికృష్ణ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా రాజీనామా నిర్ణయం గైకొనివుంటే ఆయనను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరనికూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుండగా సమైక్యాంధ్ర కు మద్దత్తుగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి తాను యాత్ర చేపట్టబోతున్నట్టుగా హరికృష్ణ ప్రకటించి దేశం పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టారు.