చిరంజీవి వ్యూహమేమిటి?

chiru-political-planingనటుడిగా కావాల్సినంత పేరు ప్రతిష్టలు ఆర్జించిన చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టారు. కాని పార్టీని నిర్వహించడం అంత తేలిక కాదు కనుక, అయినవాళ్ళని నమ్ముకుని అధికారం అప్పగించి అభాసయ్యారు. ఆఖరికి తెలివి తెచ్చుకొని, అభిమానం, ఇగో పక్కన పెట్టి కాంగ్రెస్ పంచన చేరారు . ప్రస్తుతం ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే పెద్ద చెట్టన్నట్టుగా కాంగ్రెస్ లో చలామణి అయిపొతున్నారు. మంత్రి పదవి వచ్చిన దగ్గర నుంచి, కాంగ్రెస్ రాజకీయాలని దగ్గర నుంచి చూస్తున్న కొద్దీ..  ఆయనకు అసలు కీలకం తెలిసింది. కాంగ్రెస్ లో పదవులు రావడం పోవడం అన్నది పెద్ద విషయం కాదని. ఆదిస్థానం తలచుకుంటే.. అక్కడి మధ్యవర్తులను మేనేజ్ చేయగలిగితే ఎలాగైనా, ఎవరైనా ముఖ్య మంత్రి కావచ్చని అర్థమైంది అదిగో అప్పటి నుంచి ఆయన బహుముఖ వ్యూహం రచించడం ప్రారంభించారు.

ఈ వ్యూహం మొదటి లైన్ చిరంజీవి చాలా సమర్ధుడు అన్నది ఎస్టాబ్లిష్ కావాలి. పర్యాటక నిధులు, ప్రాజెక్ట్లు తేవడం ద్వారా అది సాధించాలి. రెండవది ముఖ్య మంత్రి పదవికి తానూ అర్హుడనని చాప కింద నీరులా ప్రచారం సాగించడం. మూడవది అన్నిటి కంటే కీలకం ఆదిస్థానం కనుసన్నలలో ఉంటూ, రాసుకు పూసుకు తిరగడం. దీనికి కర్ణాటక ఎన్నికలు కలసి వచ్చాయి. ఎలాగో గెలిచే రాష్ట్రం కాబట్టి ప్రచారం మరింత ముమ్మరంగా చేశారు. ఇప్పుడీ చిరంజీవి ఈ మూడు ముఖాల బహుముఖ వ్యూహాన్ని చాలా సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. రాష్ట్రంలో తన మనుషుల ద్వారా తరచూ, తను ముఖ్యమంత్రి అవుతానని, కావాలని లాంటి ప్రకటనలు చేయిస్తున్నారు. తన సమక్షంలోనే ఇలాంటి ప్రకటనలు చేసినా వారించడం లేదు. మరో పక్క జగన్ అధికారంలోకి రావడం ఇష్టంలేని మీడియా కూడా చిరంజీవిని చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా  గా చూస్తోంది. ఇది చిరంజీవికి ఒక సానుకూల పరిణామం.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ లోని కాపు వర్గం పార్టీని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని చూస్తోంది . పార్టీలో కీలక పాత్ర వహించే రాయలసీమ రెడ్లు ఎక్కువ శాతం మంది జగన్ వెంట ఉండడం, తెలంగాణ రెడ్డ్లు పట్టించుకోక పోవడం కాపులకు కలసి వస్తోంది. నిజానికి ఇదే తరహ వ్యూహంతో, తనకు దన్నుగా ఉంటారని బొత్స సత్యనారాయణ కోరి కోరి చిరంజీవిని పార్టీలోకి తెచ్చారు. ఇప్పుడు ఆయనే ఈయనకు అడ్డంకిగా మారినట్లు కనిపిస్తోంది. ఈ నేపధ్యం లో ఎన్నికలు దగ్గరకి వస్తున్నాయి. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పదవి సంగతి చూద్దాం అనుకుంటే కాంగ్రెస్ లో కుదిరే వ్యవహారం కాదు. తీరా మెజార్టీవస్తే రేపటికి చాలా మంది ఉంటారు . అదే ఇప్పుడే ట్రై చేసుకుంటే పని సులువు. పైగా ఎన్నికల సమయం లో అడ్డున్నవారిని తప్పించవచ్చు. అందుకే చిరంజీవి వర్గం జోరు పెంచింది. ప్రకటలు, అసమ్మతి రెండూ కీలకమే. కాంగ్రెస్ కూడా కోస్తాలో కాపులను ఆకట్టునేందుకు చిరంజీవి అనుకూల నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్య పోనక్కర లేదు.