సవరణలా.. ? తిరస్కారమా.. ?

seemandra mla'sశాసన సభలో టీ-బిల్లుపై రసవత్తర చర్చకు తెరలేచింది. గురువారం విభజన బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చ జరిగిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే.. సీమాంధ్ర నేతలు తమ వ్యూహాలకు పదను పెడుతున్నారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనను అడ్డుకునే విధంగా ప్రణాళికలు రచించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడు ప్రతిపాదనలు ముందుకొచ్చినా.. వాటిలో దేనిని ఇంకా ఫైనల్ చేయలేదు. వాటిలో ఒకదానిని ఈరోజు(శుక్రవారం) ఉదయం ముఖ్యమంత్రి కిరన్ ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.

సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించిన మూడు ప్రతిపాదనల్లో మొదటిది.. మొత్తం విభజన బిల్లునే వ్యతిరేకించడం. క్లాజ్ ల వారీగా బిల్లును వ్యతిరేకిస్తే.. విభజనను అంగీకరించనట్టు అవుతుందనే కోణంలో ఈ ప్రతిపాదనను చేసినట్ట్లు తెలుస్తోంది. రెండది.. బిల్లులో లోపాలున్నాయి కావునా వాటిని హైలైట్ చేస్తూ.. సవరణలు కోరాలి. ఇక మూడవది.. క్లాజ్ ల వారీగా ప్రతిపాదనలు సమర్పించడంతో పాటుగా.. మొతం బిల్లునే వ్యతిరేకించాలన్నది మూడో ప్రతిపాదన. ఈ 3 ప్రతిపాదనల్లో మొజారిటీ నేతలు మొదటి ప్రతిపాదనకే మొగ్గు చూపారు.

పై మూడు ప్రతిపాదనలతో పాటుగా 10యేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్న హైదరాబాద్, భద్రాచలం డివిజన్, నల్గొండలో జిల్లా మునగాలపై పలు సవరణలు చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. మొత్తానికి.. అవకాశం వుంటే.. పూర్తి స్థాయిలో విభజనకు అడ్డుపడటం లేదంటే.. చర్చలు, సవరణల పేరుతో బిల్లును ఆలస్యం చేయడమే లక్ష్యంగా సీమాంధ్ర నేతలు పావులు కదుపుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ముఖ్యమంత్రి కిరణ్ నేతృత్వంలో జరగడం విశేషం. మరోవైపు, అసెంబ్లీకి ఓటింగ్ నిర్వహించే అధికారమే లేదు.. అభిప్రాయం చెప్పడానికి మాత్రం పరిమితమని టీ-నేతలు వాదిస్తున్నారు.

ఇటు, సీమాంధ్ర నేతల ఎత్తులు, అటు, తెలంగాణ నేతల పైఎత్తులతో రాష్ట్ర రాజకీయాలు మరింత రంజుగా మారనున్నాయి. సీమాంధ్ర నేతలు మొత్తం టీ-బిల్లును వ్యతిరేకించే విధంగా ఓటింగ్ నిర్వహించడంలో సఫలం అవుతారా.. ? సీమాంధ్ర నేతల వ్యూహాలకు టీ-నేతల వద్దనున్న ప్రతి వ్యూహాలు ఏంటీ.. ? తదితర ఆసక్తికర అంశాలు తెలియాలంటే.. ఈరోజు అసెంభ్లీ చర్చ (రచ్చ) స్టార్ట్ కావాల్సిందే. మొత్తానికి టీ-బిల్లుపై ఈరోజు జరిగే చర్చ చాలా కీలకంగా మారనుందన్న మాట.