రాయల ’టీ’కి అంగీకరించం : హరీష్

Harish-Rao-300x283రాయల తెలంగాణను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు తెరాస సీనియర్ నేత హరీష్ రావు. రాయల ‘టీ’ ప్రతిపాదనకు నిరసనగా తెరాస ఇచ్చిన బంద్ లో భాగంగా.. మొదక్ లో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. హరీష్ రావు నేతృత్వంలో.. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణాజలాలను రాయలసీమకు తరలించడానికి, తెలంగాణను ఫ్యాక్షన్ మయంగా మార్చి.. హైదరాబాద్ లో భూదందాలు కొనసాగించేందుకే కొంత మంది స్వార్థ రాజకీయ నాయకులు ఈ రాయల ’టీ’ కుట్రపన్నారని ఆరోపించారు.

రాయల తెలంగాణ అంటే తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ దిమ్మలను కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణపై కాంగ్రెస్ పూటకో మాట మార్చుతోందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు స్వచ్చంధంగా బంద్ లో పాల్గొంటుందని.. ఇప్పటికైనా జీవోఎం కళ్లు తెరచి సంపూర్ణ తెలంగాణ బిల్లును సిఫార్సు చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. కాగా, తెరాస ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా సంపూర్ణ బంద్ కొనసాగుతున్నట్లు సమాచారం.