Site icon TeluguMirchi.com

విశాఖపై ఎందుకింత యాగీ?

Purandeswari- tsr

రాజికీయాల్లో పట్టుదలలు ఎంతపనయినా చేయిస్తాయి. ఇప్పుడు విశాఖపై టీఎస్ఆర్, దగ్గబాటిల నుడమ నెలకొన్న యుద్ధం అలాంటిదే. నిజానికి విశాఖ ఎవరికీ స్వస్థలం కాదు. ఇద్దరూ వలసపక్షులే. అయితే ఈ విషయంలో టీఎస్ఆర్ కాస్త సీనియర్. కాంగ్రెస్ పార్టీలో టీఎస్ఆర్ సామర్థ్యంపై ఎవరికీ అనుమానం లేదు. పార్టీలో ఆయన పట్టు ఆయనకు వుంది. అందుకే రాజ్యసభ వరిస్తోంది. ఇక పురంధ్రీశ్వరి రాహుల్ కోటరీలో స్థానం సంపాదించారు. ఆమెకు వుండే బలం ఆమెకు వుంది. ఇద్దరు బలమైన నాయకుల నడుమ పోరు పార్టీకి నష్టం చేస్తంది కానీ, లాభం కాదు. నిజానికి లోక్ సభకు వెళ్లాలని టీఎస్ఆర్ కు ఎందుకు అంత మక్కువో అర్థం కాదు . ఈ రాజ్యసభ సభ్యత్వం అనంతరం మళ్లీ ఆయన మరో ఛాన్సు తెచ్చుకోగలరు. అది ఆయనకు పెద్ద కష్టమేమీ కదు. పైగా లోక్ సభ గెలుపు ఓటములు ఓటర్ ఆధీనాలు. కోట్లఖర్చుతో కూడినవి. కానీ టీఎస్ఆర్ లోక్ సభే ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కాదు. ఆలోచిస్తే రెండు విషయాలు తడతాయి. ఒకటి విశాఖ నాది అన్న విషయం నరనరాన జీర్ణించుకుపోవడం. రెండవది నా స్థానం నాకు ఎందుకు ఇవ్వరు అన్న మొండి పట్టుదల.

దీనివల్ల మరో ప్రమాదం వచ్చిపడింది. సూది కోసం సోదికి పోతే, పాత రంకులు బయటపడ్డాయని, నాగార్జున సాగర్ సిమెంట్ కుంభకోణ మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటి తరానికి గుర్తు వుండకపోవచ్చు కానీ, అప్పట్లో ఇది ఎంత సంచలనమో..టీఎస్ఆర్ కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, కొర్టులు, ఫుల్ పేజీ ప్రకటనలు, అన్నీ ఇంకా కొందరికైనా గుర్తుంది.అసలు ఈ విషయంలో టీఎస్ఆర్ తొందరపడి కవ్వింపు చర్యలకు దిగుతున్నట్లు కనిపస్తోంది. దీనివల్ల ఆయనకే నష్టం కూడా. సోనియాను కలిసిన తరువాత సైలెంట్ గా వుండి వుంటే పోయేది. సీటు కోసం తన ప్రయత్నాలు తాను సైలెంట్ గా చేసుకోవాల్సింది. అలా కాకుండా ఈ విధంగా మైండ్ గేమ్ ఆడాలని అనుకోవడం మొదటికే ముప్పు తెచ్చేలా వుంది.

పోనీ అలాగని పురంధ్రీశ్వరి వ్వవహారం ఏమన్నా విశాఖలో నల్లేరుపై నడకలా వుందా అంటే, అదీ లేదు. అక్కడ మంత్రి గంటా శ్రీనివాసౌరావుతో ఆమెకు అస్సలు పొసగడం లేదు. పైగా ఆమె సామాజికవర్గం పట్టుపట్టి ఆమెను అక్కడి నుంచే పోటీ చేయిస్తే, గంటా సామాజిక వర్గం కచ్చితంగా వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం వుంది. అదీ కాక తెలుగుదేశం నుంచి ఎవరు దిగుతారో ఇంకా తెలియదు. ఇక్కడ మళ్లీ సామాజిక సమీకరణలు తప్పవు. అలాంటపుడు అదే సీటు కావాలని అనుకోవడం ఎందుకో.

ఆలూ లేదు. చూలూ లేదు..అన్న సామెతలా..ఇంకా ఎన్నికల నగారా మోగలేదు. అప్పుడే సీట్ల గొడవలు షురూ..కాంగ్రెస్ కు ఇది మామూలే.

Exit mobile version