Site icon TeluguMirchi.com

ఒకే ముహూర్తానికి ఇద్దరితో పెళ్లి.. వైరల్ అవుతున్న శుభలేఖ !


వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనది. పెళ్లితో రెండు మనసులు ఒక్కటై.. జీవితాంతం ఒకరి కోసం ఒకరు జీవించాల్సిన బంధం. అయితే రెండు మనసులు ముడిపడటం చూసి ఉంటాం. కానీ ఇక్కడ మూడు మనసులు కలిశాయి. ముగ్గురు కలిసి బతకాలి అనుకుంటున్నారు. అదేంటీ అనుకుంటున్నారా నిజమేనండి.. ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టి పెళ్లి చేసుకోనున్నాడు ఓ వ్యక్తి. పెళ్లి ముహూర్తం కూడా ఒక్కటే. ఈ పెళ్లికి వరుడి కుటుంబంతో పాటు వధువుల కుటుంబసభ్యులు కూడా అంగీకారం తెలపడం మరో విశేషం. దీంతో ఒక్క వరుడుకు.. ఇద్దరి వధువులతో పెళ్లి జరగనుంది. ఇందుకు సంబంధించిన పెళ్లి కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామంలో గిరిజన సంప్రదాయాలు కాస్త భిన్నంగా ఉంటాయి. గిరిజన కులాల్లోని యువతి, యువకులు ఒకరిని ఒకరు ఇష్టపడితే ముందుగానే సహజీవనం చేస్తారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. సహజీవనం చేస్తున్న క్రమంలో పిల్లలు పుట్టిన తర్వాత కూడా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటారు.

ఈ క్రమంలోనే వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న సత్తిబాబు.. సునీత, స్వప్న కుమారి అనే ఇద్దరి అమ్మాయలను ప్రేమించాడు. స్వప్నతో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు భావించగా.. సునీతకు ఈ విషయం తెలిసి ప్రియుడిని నిలదీసింది. దీంతో సంవత్సరం క్రితం నుంచి స్వప్న, సునీత ఇద్దరితో కలిసి సత్తిబాబు తన ఇంట్లో కాపురం చేస్తున్నాడు. అలాగే వారిద్దరికి ఒక్కో సంతానం కూడా జన్మించారు. అయితే సత్తిబాబు కోయ గిరిజన తెగకు చెందినవాడిగా తెలుస్తుంది. ఆ తెగకు చెందినవారు కొద్దిరోజులు కాపురం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. సత్తిబాబుకు ఏడాది కాపురం చేసిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపించింది. అందుకే ఇప్పుడు బంధువులు, కుటుంబసభ్యులందరి సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

Exit mobile version