దుబ్బాక ఉప ఎన్నిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఖాళీఅయిన ఆ స్థానంలో మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బరిలోకి దిగుతున్నారు. బీజేపీ నుంచి పోటీచేస్తున్న రఘునందన్ రావు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ఐతే కాంగ్రెస్ నుంచి విజయశాంతి బరిలోకి దిగుతున్నారన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బలమైన నేతలను రంగంలోకి దించాలన్న ఉద్దేశంతో విజయశాంతికి పార్టీ హైకమాండ్ టికెట్ దాదాపు ఖరారు చేసిందన్న వార్తలు షికారు చేస్తున్నారు. ఈ క్రమంలో దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీపై విజయశాంతి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల పార్టీ రాష్ట్ర పెద్దలు విజయశాంతికి ఫోన్ చేసినట్లు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఒకవేళ మీరు పోటీచేయాలనుకుంటే టికెట్ మీకే కేటాయిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఐతే దుబ్బాకలో తాను పోటీచేయనని పార్టీ నేతలకు విజయశాంతికి స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. స్థానికంగా ఉండే ప్రచార కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నేతలతో పాటు ఢిల్లీ పెద్దలకు విజయశాంతి సూచించినట్లు సమాచారం.