Site icon TeluguMirchi.com

విజయన’గరమ్’ భగభగ

vijayanagaram-protestవిభజన ప్రకంపనలతో సీమాంధ్ర అట్టుడుకుతోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో సమైక్య జ్వాలలు తీవ్రస్థాయి లో ఎగసిపడుతున్నాయి. దాడులు, దహనాలు, ఆస్తుల విధ్వంసాలు, రాళ్ల దాడులు, పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగంతో విజయనగరం ఉద్రిక్త నగరంగా మారింది. సమైక్య ఉద్యమం హింసాత్మక మలుపు తీసుకుని.. విజయనగరం చరిత్రలో తొలిసారిగా కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కంచుకోట ఇప్పుడు బొత్స వ్యతిరేక ఆందోళనలతో రగిలిపోతోంది. రాష్ట్ర విభజనకు బొత్స సహకారం అందించారనే అనుమానంతో ఉద్యమకారులు శుక్రవారం నుంచే ఆయన ఆస్తుల ను లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలుపెట్టారు. శనివారం ఈ దాడులు తీవ్ర రూపం దాల్చాయి.

శనివారం ఉదయం నుంచే పెద్దఎత్తున ఉద్యమకారులు సత్తిబాబు ఇంటి వైపునకు నడిచారు. ఆందోళన నేపథ్యంలో బొత్స ఇంటి వద్ద బందోబస్తును రెట్టింపు చేసినప్పటికీ ఉద్యమకారులు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. తమను అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పోలీసులు పలుమార్లు బాష్పవాయువును ప్రయోగించారు. మధ్యాహ్నం వరకు పోలీసులతో పోరాడిన ఆందోళనకారులు సాయంత్రం మళ్లీ విజృంభించారు. బొత్స సత్యనారాయణ తమ్ముడైన శ్రీనివాస్‌ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. పూల్‌బాగ్‌ కాలనీలో ఉంటున్న ఆయన ఇంటిపై ఉదయం వందలాదిగా సమైక్యవాదులు దాడిచేసి అద్దాలు పగులగొట్టారు. ఇంటిముందు ఉన్న వ్యాన్‌ను ధ్వంసం చేశారు.

శనివారం సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో ఉద్యమకారులు ఒక్కసారిగా జిల్లా కేంద్ర బ్యాంకుపై విరుచుకుపడ్డారు. బయట గేట్లు, తలుపులపై పెట్రోల్‌ చల్లి తగులబెట్టడంతోబాటు ఏసీలను దహనం చేశారు. ఆవరణలో ఉన్న ఏడు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే పైడితల్లి అమ్మవారి ఆలయం ఎదుట ఒక పోలీస్‌ వాహనానికి నిప్పంటించారు. ఐజీ ద్వారకా తిరుమలరావుతోపాటు, డీఐజీ, ఎస్పీలు పట్టణంలో పహారా కాస్తుండగానే మరోవైపు విధ్వంసకాండ కొనసాగింది. ఒక దశలో పట్టణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసులు సైతం ఏమీ చేయలేని స్థితిలో పడిపోయారు.

నేటి నుంచి కర్ఫ్యూ:

విజయనగరంలో రెండురోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఐజీ ద్వారకా తిరుమలరావు శనివారం రాత్రి ప్రకటించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని పట్టణంలో పరిస్థితులను అదుపు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.సీమాంధ్రలో ఎక్కడా లేని విధంగా విజయనగరంలోనే హింసాత్మకంగా సాగుతోందని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు విజయనగరంలోని ప్రధాన వీధులన్నీ రాళ్లు, గాజు పెంకులతో నిండిపోయాయి. శనివారం జరిగిన దాడుల్లో విజయనగరం డీఎస్పీ కృష్ణప్రసన్నతో సహా 15 మంది పోలీసులు గాయపడ్డారు. 8 మంది విద్యార్థులకూ గాయాలయ్యాయి.

Exit mobile version