వచ్చే వారం రోజులు లాక్‌డౌన్‌లో అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ వారంలో ఉండే కరోనా తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలా? వద్దా? అని ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మార్చి 24న ప్రధాని మోదీ మూడు వారాల లాక్‌డౌన్ ప్రకటించాక మొదటి రెండు వారాలు ప్రజలంతా బలమైన సంకల్పంతో కరోనాపై పోరాటం చేశారని ప్రశంసించారు.
కాగా భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా 4789 మంది ఈ వైరస్ బారిన పడగా.. వారిలో 124 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే, ఈ వైరస్‌తో పోరాడి 353 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు తెలిపింది.