వంశీ.. క్లారిటీ ఇచ్చారు..!

vallabhaneni-vasmshiవిజయవాడ రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికలకు సంబంధించి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేసినేని ట్రావెల్స్ అధినేత నానిని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో.. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని బాటలోనే వల్లభనేని వంశీ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ వస్తున్న వార్తల్ని వల్లభనేని వంశీ కొట్టిపారేశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశంకు ఓటమి ఖాయమని టాక్ రావడంతో టీడీపీని వీడేందుకు వీరిద్దరూ రెడీ అయినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే తాజాగా టీడీపీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలపై వంశీ మాట్లాడుతూ.. టీడీపీ వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు మాటే తనకు శిరోధార్యమన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. పార్టీకి తన సేవలు అవసరం లేని రోజున ట్రస్టు ద్వారా ప్రజలకు సేవచేస్తానని వంశీ చెప్పారు. మరో పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. గన్నవరం సీటు ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేయనని వంశీమోహన్ అన్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వంశీ పార్టీ విడుతున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. వంశీ ఎక్కడికి వెళ్లరు మా పార్టీలోనే ఉంటారు. వంశీని ఎక్కడ ఉపయోగించుకోవాలో.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.