వడ్డించేవాడు మనవాడైతే..

Operation-Duryodhana-2-postవడ్డించేవాడు మనవాడైతే కడ పంక్తిలో కూర్చున్నా వచ్చిన లోటేమీ వుండదు. అలాంటిది సిఎమ్ తలచుకుంటే ఆదేశాలకు, మినహాయింపులకు కరువా? అధికారంలో వున్నవారు అస్సలు జంకు గొంకు లేకుండా ఎలా ప్రవర్తిస్తారనడానికి ఇదో అద్ధుతమైన ఉదాహరణ. అదే..ఆపరేషన్ దుర్యోధన సినిమాకు పన్ను మినహాయింపు వ్యవహారం. ఆపరేషన్ దుర్యోధన -2 సినిమాకు వినోదపు పన్ను మినహాయింపునకు రంగం పూర్తిగా సిద్ధమయింది. జగపతిబాబు, పొసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ సినిమా ఏమాత్రం బాగాలేదని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాష్ర్ట న్యాయశాఖామంత్రి ఏరాసు ప్రతాపరెడ్డ ముఖ్యమంత్రి పాత్ర ధరించారు. ముఖ్యమంత్రికి, అతగాతడిని పదవిలోంచి దింపాలనుకునే వ్యక్తి నడుమ జరిగిన వ్యవహారాలే సినిమాలో కథాశం. ఇలాంటి సినిమాలు మనకు సవాలక్ష. ఇందులో అద్భుతమైన సందేశమూ లేదు. సమాజానికి పనికి వచ్చే విషయమూ లేదు. కానీ సినిమా నిర్మాతలు వినోదపు పన్ను మినహాయింపు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి దరఖాస్తులు ఏళ్ల తరబడి ఈ శాఖకు ఆ శాఖకు నడుమ తిరుగడం కద్దు. కానీ ఇక్కడ సినిమాలో వేసింది న్యాయశాఖ మంత్రి. పైగా సినిమా నిండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భజన సాగింది. ఇక అడ్డేముంది. ఆఘమేఘాల మీద ఫైలు కదిలింది. ముఖ్యమంత్రి సంతకం కూడా అయిపోయిందని తెలిసింది. అయితే వాణిజ్య పన్నుల శాఖకు చిన్న అనుమానం వచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో వుంది కదా..ఉత్తర్వులు ఇవ్వచ్చా..ఇవ్వకూడదా అని. అందుకే ఇప్పుడు ఫైలును ఎన్నికల కమిషన్ పరిశీలనకు పంపారు. అక్కడి నుంచి ఓకె అని రావడం భయం..ఉత్తర్వులు వచ్చేస్తాయి.