Site icon TeluguMirchi.com

ఉన్నామా…అస‌లున్నామా…

trs
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతోన్న పథ‌కాల్లో త‌మ భాగ‌స్వామ్యం లేకుండా పోతుంద‌ని వాపోతున్నారు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిలు. అధికారికంగా 63 మంది ఎమ్మెల్యేలున్నా…మిగిలిన చోట్ల మొన్న‌టి సాధార‌ణ ఎన్నికల్లో ఓడిపోయిన వారే ఇంకా ఇంచార్జిలుగా కొన‌సాగుతున్నారు. నియోజ‌క వ‌ర్గాల్లో వారే బాస్ ల‌ని…వారు చెప్పిన‌ట్టే జ‌రుగుతుంద‌ని సీఎంగా కేసీఆర్ ప‌లుమార్లు వారికి హామినిచ్చారు. కానీ వాస్త‌వ ప‌రిస్థితి అలా ఉండ‌టం లేద‌ని నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిలు వాపోతున్నారు. పేరుకే ఇంచార్జిలు కానీ పెత్త‌నమంతా స‌ర్కారీ అధికారులే చెలాయిస్తున్నార‌ని… చిన్న ప‌ని కూడా త‌మ చేతులు మీద జ‌ర‌గ‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు వారు.

అధికారం వ‌చ్చాక‌…చాలా విష‌యాల్లో స్థానిక నియోజ‌క వ‌ర్గ ప్ర‌మేయం లేకుండా చాలా కార్య‌క్ర‌మాలు జ‌రిగిపోతున్నాయ‌ని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఉన్న‌చోట స‌మ‌స్య లేదు. కానీ కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి ఉన్న‌చోటే స‌మ‌స్య వ‌స్తుందంటున్నారు వారు. ప్ర‌త్యేకించి ఫించ‌న్లు, ఇళ్లు, రేష‌న్ కార్డుల జారీ లాంటి విష‌యాల్లో సాధార‌ణంగా స్థానిక ప్ర‌జాప్ర‌తినిధిని ప్రజ‌లు క‌లుస్తుంటారు. కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక‌.. అధికారులే నేరుగా నిజ‌మైన ల‌బ్ధిదారుల‌కు ఇవి అందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. రేష‌న్ కార్డుకు ఎమ్మార్వో, ఫించ‌న్‌కు ఎమ్డీవో లకు ల‌బ్ధిదారులు ద‌రఖాస్తు చేసుకుంటున్నారు. అఖరికి డ‌బుల్ బెడ్ రూమ్ ల‌బ్ధిదారుల ఎంపిక చేసే బాధ్య‌త‌ను కూడా స్వ‌యం సహ‌య‌క బృందాల‌కు అప్ప‌గించింది స‌ర్కారు. దాంతో ప్ర‌తిది స‌ర్కారు అధికారులే చేసుకుంటూ పోతే… నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే అవకాశం లేకుండా పోతుందని చెప్పుకొస్తున్నారు కొంద‌రు ఇంచార్జిలు.

ఈ ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే..మున్ముందు క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌ల‌ప‌డేది పోయి..బ‌ల‌హీన ప‌డుతుంద‌ని…నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిల‌కు నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టుసాధించ‌లేర‌ని ఇంచార్జిలు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉండే కేడ‌ర్ సైతం త‌మ‌ను లెక్క‌చేయ‌ని ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. గ‌త కాంగ్రెస్ హ‌యంలో ప్ర‌తి ప్ర‌భుత్వ ప‌థ‌కం స్థానిక నేత‌ల చేతుల మీద‌గా ఇచ్చే ప‌రిస్థితి ఉంద‌ని…దాంతో ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఆమాత్రం కేడ‌ర్ ఉండ‌టానికి ప్ర‌ధాన కార‌ణం అదేనంటున్నారు ఇంచార్జిలు. ఇక‌నైనా కేసీఆర్ క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితిని గ‌మ‌నించి… నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిల‌కు మ‌రింత ప్రాధాన్యం ఉండేలా చూడాలంటున్నారు.

Exit mobile version