శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఎన్డీఏ కూటమిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ కూటమిలో ఈడీ, ఐటీ, సీబీఐ అనే మూడు పార్టీలే బలంగా ఉన్నాయని సామ్నాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విమర్శించారు. ఇటీవల ఎన్డీఏ పక్షాల భేటీ అనంతరం థాక్రే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయంశమైంది. భాజపా కూటమిలో 36 పార్టీలు ఉన్నా.. 24 రాజకీయ పార్టీలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదన్నారు. కేవలం ఈడీ, ఐటీ, సీబీఐ లను ఉసికొల్పి ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. మణిపూర్ లో జరుగుతున్న అల్లరపై థాక్రే స్పందించారు. అక్కడ ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లలేదన్నారు. యూసీసీ దేశమంతా అమలు చేస్తానంటున్న కేంద్రప్రభుత్వం ముందుగా జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు గోవధ నిషేధ చట్టం తేవాలని డిమాండ్ చేసారు. చట్టం ముందు అందరూ సమానులైతే.. భాజపాలో ఉన్న నేరస్థులకు ఎందుకు శిక్ష పడలేదని ప్రశ్నించారు.
తమ పార్టీలో చీలిక తెచ్చి థాక్రే వర్గం కనమరుగవుతుందని కొందరు భావించారు. కానీ ఎప్పటికైనా శివసేన పార్టీ థాక్రే వర్గానిదేనని స్పష్టం చేశారు. ఇటీవల బెంగళూర్ లో జరిగిన విపక్షాల కూటమి సమావేశంలో 26 పార్టీలు పాల్గొన్నాయి. ఈ సమావేశానికి థాక్రే హాజరైయ్యారు. నూతన కూటమి పేరు india(ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇంక్లూజివ్ అలియన్స్) నామకరణం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్డీఏ ను ఇండియా కూటమి ఢీకొడుతుందా, సీట్లసర్దుబాటు, నాయకత్వం, ప్రధాని ఎవరనేది కూటమి ముందున్న అసలు సమస్య. ఎన్డీఏ, విపక్షాల కూటమి ఇండియా రెండింటిలోనూ భాగస్వామ్యం లేని 11 పార్టీలున్నాయి. ఏపీ నుంచి వైకాపా, తెదేపా తెలంగాణ నుంచి భారాస, ఎంఐఎం, ఒడిస్సా నుంచి బీజేడీ తదితర పార్టీలున్నాయి. ఇప్పటికే అంశాల వారీగా వైకాపా, బీజేడీ పార్లమెంట్ లో కేంద్రానికి మద్దతు ఇస్తున్నారు. ఇంకో కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో అప్పుడే రాజకీయ వేడి మొదలైంది.