ఇక రెండు పీసీసీలు?

comgress high commandరాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం పార్టీ,పరిపాలన అంశాలపై కూడా దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్ ను ఆమోదించిన అనంతరం పరిపాలన విషయంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి పార్టీ పీసీసీ పదవులతోనే నాంది పలకాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షులుగా ఉన్న బొత్స సత్యనారాయణను ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా ఉంచుతూనే తెలంగాణకు ప్రత్యేక పీసీసీని ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన పాల్వాయి గోవర్థన్ రెడ్డిలాంటి పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అధిష్టానంతో ఈ విషయంపై చర్చించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పార్టీ కార్యకలాపాలు, భవనాల విషయంలో కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ న కొనసాగించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పుడున్న గాంధీ భవన్ ను ఆంధ్రప్రదేశ్ పీసీసీ కార్యాలయంగా, గాంధీ భవన్ పక్కన నిర్మించిన కొత్త భవనాన్ని తెలంగాణ పీసీసీ కార్యాలయంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గీయుల్లో చర్చజరుగుతోంది. మరి రాష్ట్ర విభజన,పరిపాలనాంశాలకు పీసీసీ విభజనతోనే ప్రారంభించనున్నారా అనేది చూడాలి మరి.