విభజన సమస్యలపై ద్విసభ్య కమిటీ !

ak antony digvijya singరాష్ట్ర విభజనపై విషయంలో తలెత్తే సందేహాలు, సమస్యలపై కేంద్రం ద్విసభ్య కమిటీని నియమించింది. ఈ ద్విసభ్య కమిటీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ సభ్యులుగా ఉంటారని ప్రకటించింది. ప్రధానంగా విభజన విషయంలో సీమాంధ్రలు వ్యక్తం చేస్తున్న హైదరాబాద్, జల, విద్యుత్, ఉద్యోగాలు.. తదితర అంశాలను ఈ కమిటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు సమైక్యాంధ్ర కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీతో సమావేశమయ్యారు. ఈ సమావేశమనంతరం కేంద్రమంత్రి జేడీ శీలం విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులను కలుసుకున్నామని, పదవులకు రాజీనామాలు చేద్దామని కొందరు, మంత్రి పదవులకే రాజీనామాలు చేద్దామని మరికొందరు, పార్లమెంట్ సమావేశాలను స్తంభింప చేద్దామని ఇంకొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారని అన్నారు. సీమాంధ్ర మంత్రులు తెలిపిన విషయాలను అధినేత్రి సోనియాగాంధీ, హోంశాఖ మంత్రి షిండేలతో చర్చిస్తానని శీలం తెలిపారు. సమస్యకు పరిష్కారం రాజీనామాలు కాదని, రాజీనామాలు చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని శీలం పేర్కొన్నారు.