తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును విశ్లేషించి మెరుగుపరచేందుకు ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం మొదటి సమావేశం నేడు బి.ఆర్.కె.ఆర్ భవన్లో ఆర్థిక శాఖామాత్యులు శ్రీ టి.హరీశ్ రావు అధ్యక్షతన జరిగింది.
ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, అందిస్తున్న వైద్య సేవల గురించి కమిటీ కూలంకషంగా చర్చించింది. పేద ప్రజలకు సాధారణ వైద్య సేవలతో పాటు ప్రత్యేక వైద్య చికిత్సలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో కమిటీ చర్చించింది. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మంత్రులు శ్రీ శ్రీనివాస్ యాదవ్ (పశుసంవర్థక శాఖ) , శ్రీ జగదీశ్ రెడ్డి (విద్యుత్), శ్రీ శ్రీనివాస్ గౌడ్ (ఎక్సైజ్), శ్రీ ప్రశాంత్ రెడ్డి (రోడ్లు, భవనాలు), శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి (విద్య), శ్రీమతి సత్యవతి రాథోడ్ (గిరిజన సంక్షేమం) సమావేశంలో పాల్గొన్నారు.