పాల్వంచ రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. అతడిపై వచ్చిన ఆరోపణలను పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. కాగా, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడైన రాఘవేందర్ అరెస్ట్ పై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతోంది. అతడిని పోలీసులు నిన్న అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను పోలీసులు ఖండించడంతో రాఘవేందర్ ఆచూకీపై సస్పెన్స్ నెలకొంది.
కొత్తగూడెం జిల్లాలో ఈనెల 3వ తేదీన పాల్వంచలోని పాత బజారుకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు. తమ ఆత్మహత్యకు వనమా రాఘవ కారణమని రామకృష్ణ సూసైడ్ నోట్ రాయడంతోపాటు సెల్ఫీ వీడియో తీసుకుని, అనంతరం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వీడియో మీడియాలో ప్రసారమైంది. దీంతో రామకృష్ణ, అతడి కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన టీఆర్ఎస్ లీడర్ వనమా రాఘవ పాల్వంచలోని తన ఇంటి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలింపు చేస్తున్నారు.