Site icon TeluguMirchi.com

కాంగ్రెస్‌కు స్వయంగా ఛాన్స్‌ ఇస్తున్న టీఆర్‌ఎస్‌!!


కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మొదటి ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసింది. రెండవ సారి కూడా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా రాజకీయ పండితులు అంతా భావిస్తున్నారు. 2014 ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్‌ కాస్త పెరిగే అవకాశం ఉంది, తప్ప అధికారంలోకి వచ్చేంత దమ్ము కాంగ్రెస్‌కు లేదు అని తల పండిన రాజకీయ నేతలు చెప్పుకొచ్చారు. తాజాగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న పనులతో స్వయంగా కాంగ్రెస్‌కు ప్రాణం పోస్తున్నట్లుగా అనిపిస్తుంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ లేచి ఉరికే పరిస్థితికి స్వయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు తీసుకు వెళ్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వంపై ప్రస్తుతం యువతలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను క్యాష్‌ చేసుకునేందుకు కాంగ్రెస్‌ కృషి చేస్తోంది. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం దళిత వ్యతిరేకి అని తాజాగా జరిగిన సిరిసిళ్ల జిల్లా నేరెళ్ల సంఘటనతో తేలిపోయింది. ఆ సంఘటనను కాంగ్రెస్‌ పార్టీ బాగా క్యాష్‌ చేసుకుంది.

మీడియాలో మంచి మైలేజ్‌ కూడా దక్కింది. లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ స్వయంగా నేరెళ్లకు రావడంతో పాటు ఇందుకేనా మేం తెలంగాణ ఇచ్చింది అంటూ ప్రశ్నించి ప్రభుత్వంను ఇరుకున పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు జరిగింది కొద్దిగే.. ముందు ముందు ఇలాగే కాంగ్రెస్‌కు అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్తే కాంగ్రెస్‌ 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చినా ఇవ్వొచ్చు అనేది రాజకీయ పండితుల మాట.

Exit mobile version