23 ఏళ్లకే మేయర్ పీఠం.. రికార్డు సృష్టించిన యువతి


కర్ణాటక రాష్ట్రం బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్‌గా 23 ఏళ్ల డి.త్రివేణి ఎన్నికైంది. నాలుగో వార్డు కార్పొరేటర్‌గా ఉన్న ఆమె మేయర్‌ పీఠానికి బుధవారం జరిగిన ఓటింగ్‌లో విజయం సాధించారు. దీంతో ఆ రాష్ట్రంలోని అత్యంత పిన్న వయస్కురాలు అయిన మేయర్‌గా ఆమె నిలిచింది. కాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన త్రివేణి 18 ఏళ్లకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

ఇకపోతే త్రివేణి విమ్స్‌ వైద్య కళాశాలలో డిప్లొమా ఇన్‌ఫార్మసీ పూర్తి చేశారు. ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నానని, కార్పొరేటర్ల సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానని త్రివేణి వెల్లడించారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే గతంలో త్రివేణి తల్లి సుశీలా బాయి కూడా మేయర్‌గా పనిచేశారు.