కామెడీ త్రయం కేరాఫ్ టీడీపీ

star comidianసినిమా నటులంటే అందరూ మోజు పడితే, వాళ్లు రాజకీయాల్లోకి రావాలనుకోవడం తెలుగునాట పెద్ద మ్యాజిక్. ఎన్టీఆర్ కు ముందు జగ్గయ్య కాలం నుంచీ వస్తోందీ వ్యవహారం. మళ్లీ మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే, సినిమా నటులకు సహజంగానే గిరాకీ పెరుగుతోంది. చిత్రమేమిటంటే, హాస్యనటులుగా లబ్ద్ధిప్రతిష్టులైన వారంతా టీడీపీ ఖాతాలో కనిపించడం. ఒక్క ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒక్కరే ప్రస్తుతం వైకాపాలో వున్నారు. ఆయన కాంగ్రెస్ లో వుంటూ, అక్కడి నుంచి ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం ఏవీయస్, అలీ, బ్రహ్మానందం పేర్లు తెలుగుదేశం వైపు నుంచి వినిపిస్తున్నాయి. ఏవీయస్ బహిరంగంగానే టిక్కెట్ ఇస్తే తెనాలి నుంచి పోటీ చేసే ఉద్దేశం వున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆలీని రాజమండ్రి నుంచి, బ్రహ్మానందాన్ని సత్తెనపల్లి నుంచి పోటీకి దింపే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బట్టల సత్యంగా పేరొందిన మల్లికార్జున రావు కూడా తెలుగుదేశం పార్టీలో చాలా చురుగ్గా పనిచేశారు. ఆయన అనకాపల్లి నుంచి పోటీకి కూడా ప్రయత్నించారు. కానీ అకాల మరణం పొందడంతో ఆయన రాజకీయ ప్రస్థానం అర్థాంతరంగా ఆగిపోయింది.

ఇప్పటికే మురళీ మోహన్ తదితర సినీ ప్రముఖులు దేశం ఖాతాలో వున్నారు. ఇప్పుడు ఈ త్రయం కూడా తోడయితే, అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మంచి మైలేజీ ఇవ్వడం ఖాయం. అందునా ఏవీయస్ , బ్రహ్మానందం లాంటి నటులు తోడైతే ఇంకా డిఫరెంట్ గా వుంటుంది. ఎందుకంటే, వీరిద్దరూ సినిమా రంగంలో వివిధ నటులతో, వర్గాలతో సన్నిహితంగా వుంటూ వస్తున్నవారు. దాని వల్ల కేవలం వీరిద్దరే వచ్చినట్లు కాక, వారందరి మద్దతు కూడ గట్టే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దేశం ఈ విధంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.