ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తెలివికి సరిహద్దు పోలీసులు షాక్ ఇస్తున్నారు. హైదరాబాద్ లో లాక్ డౌన్ పెట్టబోతున్నారనే వార్తలు వైరల్ కావడం తో చాలామంది హైదరాబాద్ ను వదిలి సొంతర్లుకు ప్రయాణం అవుతున్నారు. దాంతో నాలుగైదు రోజులుగా ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులో ఉన్న చెక్‌పోస్ట్‌ల దగ్గర రద్దీ పెరుగుతోంది. హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళ్లే గరికపాడు.. గుంటూరు జిల్లా మీదుగా వెళ్లే పొందుగల చెక్‌పోస్టులు దగ్గర వాహనాలు, జనాలతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ ప్రభావంతో టోల్‌గేట్ల దగ్గర రద్దీ కనిపిస్తోంది.
ఇక చెక్‌పోస్టుల దగ్గర థర్మల్ స్క్రీనింగ్ చేయడం, అలాగే కొన్ని ర్యాండమ్‌గా శాంపిల్స్ సేకరించడం..పాస్ లు ఉంటేనే ఆంధ్ర కు పంపించడం వంటివి చేస్తున్నారు. దీంతో చెక్ పోస్ట్ ల దగ్గరే గంటల గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే పాస్‌లు లేకుండా సొంత ఊళ్లకు వెళ్లేందుకు జనాలు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. కారులో వెళితే పాస్ తప్పనిసరి.. దీంతో కొందరు బైక్‌లపై సొంత ఊళ్లకు వెళుతున్నారు. వారికి కూడా పోలీసులు షాకిస్తున్నారు.. పాస్‌లు, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేస్తున్నారు. మరికొందరు హైదరాబాద్ నుంచి కారులో వచ్చి చెక్‌పోస్టుకు దూరంగా ఆగిపోతున్నారు.. అక్కడి నుంచి నడిచి చెక్‌పోస్ట్ దాటేస్తున్నారు. ఆ తర్వాత ఏపీ బోర్డర్ వైపు నుంచి మరో కారులో వెళ్లిపోతున్నారు. ఇలా కొత్త కొత్త ఐడియాలతో జనాలు పాస్‌లు లేకుండా వెళ్లిపోతున్నారు.. కొందరు మాత్రం పాస్‌లు లేకుండా వచ్చి పోలీసులు సూచనతో వెనక్కు వెళ్లిపోతున్నారు. ఇక ఎమర్జెన్సీ పనుల (చావులు, హెల్త్ ఎమర్జెన్సీ) మీద వస్తున్నవాళ్లు సరైన పత్రాలు చూపిస్తే పోలీసులు వదిలేస్తున్నారు.