Site icon TeluguMirchi.com

పొగాకు ట్రేడర్లకు చంద్రబాబు డెడ్‌లైన్

tobaco-traders
‘రైతులు కష్టకాలంలో వున్నారు, వారిని ఒడ్డున పడేయడం మీ ధర్మం, వారికి మనస్ఫూర్తిగా సహకరించండి, వాళ్లల్లో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపండి’- అని పొగాకు ట్రేడర్లకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు హితబోధ చేశారు. సెప్టెంబరు నెలాఖరులోగా పొగాకు బోర్డు ద్వారా మొత్తం కొనుగోళ్లు పూర్తిచేయించి రైతులను ఆదుకుంటామని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించి వెళ్లిన 12 రోజులకు కూడా పూర్తిస్థాయి కొనుగోళ్లు జరగకపోవడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇది ట్రేడర్ల బాధ్యతారాహిత్యమని అన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం మేరకు పొగాకు వర్తకులు తక్షణం స్పందించి సరుకు కొనుగోళ్లు పూర్తిచేయకపోతే ఇక రాష్ట్రంలో వారు ట్రేడింగ్ చేయకుండా నిషేధిస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. వారానికి 10 మిలియన్ కిలోల చొప్పున మొత్తం 3 వారాల్లో వేలం ప్రక్రియ పూర్తిచేసి అధీకృత, అనధీకృత పొగాకు సరుకంతా రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీనిపై ప్రతి శుక్రవారం సమీక్షించి సమస్యలేవైనా వుంటే తదుపరి చర్యలు తీసుకుందామని చెప్పారు.

తిరస్కరించిన నాసిరకం సరుకుతో కలిపి ఇంకా మొత్తం 36 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లు మిగిలిపోయాయని ట్రేడర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మొత్తం సరుకు వేలాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ 3 వారాలలో పూర్తిచేయాలని, దీనిపై వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన ఆదేశాలిప్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రైతుల ఇబ్బందులను గమనించి తిరస్కరించిన పొగాకు సహా మొత్తం సరుకును వెంటనే కొనుగోలు చేయాలని ఇప్పటికి పలు విడతలుగా జరిపిన సమావేశాల్లో నిర్ణయించామని, ప్రభుత్వాలు ముందుకొచ్చి ప్రతి కిలోకు కేంద్రం రూ.15, రాష్ట్రం రూ.5 చొప్పున మొత్తం రూ.20 సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి వివరించారు. సమస్యల్లో కూరుకుపోయిన రైతుల పట్ల ప్రభుత్వం ఎంత ఉదారంగా వున్నా క్షేత్రస్థాయిలో వారికి న్యాయం జరగపోతే ఉపేక్షించేది లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.5 చొప్పున మొత్తం రూ.7.86 కోట్ల మేర వెంటనే అందించేందుకు సిద్ధంగా వుందని, ఆ మొత్తాన్ని వెంటనే రైతులకు డిపాజిట్ అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రైతు క్షేమం కోసం ఎంత పెద్ద మొత్తంలోనైనా ఖర్చుపెట్టేందుకు వెనుకాడేది లేదని అన్నారు. ట్రేడర్ల వ్యవహారశైలి వలన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ పెంచి పోషించిన రైతుల రుణాన్ని తీర్చుకునే సమయం వచ్చిందని పొగాకు వర్తకులకు ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

Exit mobile version