అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులో వున్నా టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు.. గత ఆదివారం ఐదుగురితో బయలుదేరి వెళ్లిన టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం పెరగడం వల్ల ‘టైటాన్’ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. టైటానిక్ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ పేర్కొంది.
వెంటనే ఈ విషయాన్ని బాధితుల కుటుంబాలకు తెలిపినట్లు రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ తెలిపారు. యూఎస్ కోస్ట్ గార్డ్, రెస్య్కూ సిబ్బంది తరఫున మృతులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపోతే ఈ జలాంతర్గామిలో పాకిస్తాన్ కు చెందిన బిలియనీర్ షెహజాదా దావుద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19), బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్(58), ఫ్రెంచ్ మాజీ నేవీ అధికారి పాల్ హెన్రీ నార్గోలెట్(77), ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్(61) వున్నారు.