తిరుమల ఘాట్ రోడ్డులో ఈ ఉదయం కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించామన్నారు. యుద్ధప్రాతిపదికన ధ్వంసమైన రోడ్డు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు.
కొండ చరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో ఈ సాయంత్రానికి ఐఐటీ ఢిల్లీ నిపుణులు తిరుమలకు చేరుకుంటారని సుబ్బారెడ్డి తెలిపారు. TTD ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులతో కలసి వారు రహదారుల పరిశీలన చేస్తారన్నారు.కొండ చరియలు విరిగిపడకుండా తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి 2,3 రోజుల్లో నివేదిక సమర్పిస్తారని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.