టర్కీ, సిరియాల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన శక్తివంతమైన భూకంపం ధాటికి రెండు దేశాల్లో వేలాదిమంది ప్రజలు మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. కుటుంబాలకు కుటుంబాలే శిధిలాల కింద చిక్కుకుపోయాయి. తాజా సమాచారం ప్రకారం, మరణించిన వారి సంఖ్య 4500 పై చిలుకే. ఒక్క టర్కీలోనే 3వేలకు పైగా చనిపోగా, సిరియాలో సుమారు 15వందల మంది మృత్యువాత పడ్డారు. టర్కీలో ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. వరుసగా మూడు భారీ భూకంపాలతో ఆ దేశం అతలాకుతలమైనట్లు అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డగోన్ తెలిపారు.
అంతేకాదు టర్కీలో సుమారు 185 సార్లు భూ ప్రకంపనలు నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఖరమన్‌మారస్ కేంద్రంగా భూమి కంపించిన విషయం తెలిసిందే. రెండో కంపం 7.7 తీవ్రతతో, మూడవది 7.6 తీవ్రతతో సంభవించినట్లు అధికారులు తెలిపారు. టర్కీలో వచ్చిన భూకంపం వల్ల గ్రీన్‌ల్యాండ్‌లో కూడా ప్రకంపనలు నమోదు అయినట్లు డెన్మార్క్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
ఇక భూకంపం దాటికి వేలాది భవనాలు నేలమట్టం కావడంతో రోడ్డుకిరువైపులా కూలిపోయిన భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. ఎంతోమంది నిరాశ్రుయులయ్యారు. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో టర్కీ, సిరియాకు సాయం చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. భారత్ తన వంతు సాయంగా ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలను, క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని, అవసరమైన ఔషధాలు, ఇతర సహాయక సామాగ్రి కూడా పంపించింది.